/యలమంచిలి /: కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని డివైన్ మెర్సీ ఆర్.సి.ఎమ్ చర్చి వేదికగా నిర్వహించిన రత్నం షోటోకాన్ కరాటే అకాడమీ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్‌లో యలమంచిలి విద్యార్థులు పతకాల పంట పండించారు. పి.ఎన్.ఆర్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ యలమంచిలి బ్రాంచ్ నుండి పాల్గొన్న 30 మంది విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచి మొత్తం 30 పతకాలను కైవసం చేసుకున్నారు. ఇందులో 19 బంగారు పతకాలు, 8 వెండి పతకాలు, 3 కాంశ్య పతకాలు సాధించి యలమంచిలి పేరును రాష్ట్ర స్థాయిలో చాటి చెప్పారని అన్నారు. ఈ పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా యలమంచిలి బ్రాంచ్ కు చెందిన ఎస్.కె. అఫ్రీన్ భాను, పి.బి.ఎస్. హర్షిణి అను ఇద్దరు క్రీడాకారిణులు సౌత్ జోన్ ఉమెన్స్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలను ఉత్సాహపరిచారని అన్నారు. విద్యార్థుల ఈ ఘన విజయం పట్ల కరాటే మాస్టర్ నక్కా వెంకట రమణ, ఇన్స్ట్రక్టర్ తగిరికోట శ్రీను బృందం హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.