రాత్రి వేళల్లో జరిగే రహదారి ప్రమాదాల నివారణకు అనకాపల్లి జిల్లా పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరవాడ సబ్ డివిజన్ నైట్ రౌండ్స్‌లో భాగంగా బుధవారం తెల్లవారుజామున యలమంచిలి ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై ఉన్న కొక్కిరపల్లి జంక్షన్ వద్ద పోలీసులు “స్టాప్ అండ్ ఫేస్ వాష్” కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి సమయంలో సుదీర్ఘ ప్రయాణాలు చేస్తూ అలసట, నిద్రమత్తుకు గురయ్యే లారీలు, బస్సులు, కార్లు తదితర వాహనాలను నిలిపివేసి డ్రైవర్లకు ముఖాలు కడిగించారు. సుమారు 50కు పైగా వాహనదారులకు ముఖం కడిగించి నిద్రమత్తు వదిలించారు. అనంతరం డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించి, జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తూ సురక్షితంగా పంపించారు. రాత్రి వేళల్లో నిద్రమత్తు కారణంగానే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి వినూత్న కార్యక్రమాల వల్ల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.