బ్లాక్ మార్కెట్ను అరికట్టి సరసమైన ధరలకు వంటగ్యాస్, ఇతర సరుకులు అందించాలి, సిపిఎం

బ్లాక్ మార్కెట్ను అరికట్టి సరసమైన ధరలకు వంటగ్యాస్, ఇతర సరుకులు అందించాలి, సిపిఎం

12/March/2026 15:15    Share:   

యుద్ధం సాకుతో జరుగుతున్నబ్లాక్ మార్కెట్ను అరికట్టి సరసమైన ధరలకు వంటగ్యాస్, ఇతర సరుకులు అందించాలి, సిపిఎం
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దురాక్రమణ దాడి తర్వాత లాభాపేక్షతో బడా వ్యాపారస్తులు సాగిస్తున్న బ్లాక్ మార్కెట్ను అరికట్టి సరసమైన ధరలకు వంటగ్యాస్, ఇతర సరుకులు అందించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. ఈ రోజు పూడిమడకలో పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించి బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము, పూడి మడక శాఖ కార్యదర్శి చేపల తాతయ్య మాట్లాడుతూ వంటగ్యాస్ ధర పెరగడంతోపాటు బ్లాక్ మార్కెటింగ్ వల్ల సిలిండర్లు దొరకని కారణంగా దేశమంతటా నగరాలు, పట్టణాలు హోటళ్లు మూతపడడంతో పాటు, కొన్ని రకాల వంటకాలు లభించడం లేదని ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సాధారణమైన తోపుడుబండ్లు, చిన్న కాకా హోటళ్ల నిర్వాహకుల బతుకులు బజారునపడతాయని వివరించారు. అసంఘటిత కార్మికులు, చిరుద్యోగులకు లభించే టీ, టిఫిన్, భోజనం సరసమైన ధరకు దొరక్కుండా పోయే ప్రమాదం ఏర్పడుతుందని, ఈలోగా వాటి ధరలు అమాంతం పెరిగిపోతాయని, వంటగ్యాస్ కొరత వల్ల ఆహార లభ్యత మొదలు ఉపాధి వరకు వివిధ రూపాల్లో
సమాజంపై దుష్ప్రభావం పడుతుందని తెలిపారు. ఇప్పటికే గృహ వినియోగదారులు సిలిండర్ కోసం బుక్ చేస్తుంటే తగిన స్పందన ఉండటం లేదని, ఇంతకుముందే బుక్ చేసిన వారికీ ఐదారు రోజులైనా గ్యాస్ సిలిండర్ రావడం లేదని పేర్కొన్నారు. ఇళ్లలో, మార్కెట్లలో ఇటువంటి సమస్యలు ఏర్పడుతుండగా వ్యవసాయ రంగానికి కూడా ఎరువుల లభ్యత సమస్యగా మారనుందని పేర్కొన్నారు. గ్యాస్ కొరత రాకుండా బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాలని, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనంతరం పెట్రోలు, డీజిల్ ధరలూ పెరుగుతాయని వార్తలు వస్తున్నాయని, దాంతో సరుకు రవాణా, ప్రజా రవాణా కూడా భారమవుతాయని తెలిపారు. గల్ఫ్ ఎగుమతులు ఆగిపోయిన దృష్ట్యా గుడ్లు, పండ్లు, బియ్యం, ఆక్వా, గ్రానైట్ సరుకులు నిల్వలు ఉండిపోతున్నాయని, వ్యాపారస్తులు రైతుల నుండి వీటిని ధరలు తగ్గించి కొంటున్నారని యుద్ధం నివారణకు భారత ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రజలపై బారాలు పడకుండా నివారించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో గనగల నూకరాజు, చేపల రవణమ్మ, సురాడ కోటి, చౌడుపల్లి పెంటమ్మ, ఇంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter