రాంబిల్లిలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న, స్కీం వర్కర్స్, శ్రామిక మహిళలతో సిఐటియు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి, జి దేవుడు నాయుడు మాట్లాడుతూ నేటి సమాజంలో సగభాగంగా ఉన్న, మహిళలు అన్ని రంగాలలో ఉన్నప్పటికీ, మహిళలకు తగిన ప్రాధాన్యత గాని, గుర్తింపు గానీ, సమాన వేతనాలు కానీ చెల్లించడంలో వివక్షత కొనసాగుతుందని అన్నారు. సంపద ఉత్పత్తిలో, సమాజ అభివృద్ధిలో, మానవ అభివృద్ధిలో మహిళలు శ్రమ ఉన్నప్పటికీ, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం గానీ, మహిళలను గుర్తించడంలో గాని ప్రభుత్వాలు తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళలను పొగడడం తప్ప, వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్క లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శ్రామిక మహిళలను అన్ని విధాల ఆదుకుంటామని, ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసిన, కనీస వేతనాలు పెంచడంలో, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలం చెందుతున్నారని అన్నారు. రాబోయే కాలంలో, మహిళలు అన్ని రంగాలలో, మరింత ఐక్యమత్యంతో పోరాడి, మహిళా హక్కులు, కనీస వేతనాలు సాధించుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వెలుగు యానిమేటర్స్ పాల్గొన్నారు