విద్యార్థిని, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
05/March/2026 20:37
Share:
అనకాపల్లి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో విద్యార్థిని, విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు మరియు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. వెంకటనారాయణ గారు పాల్గొని విద్యార్థులకు మరియు ప్రయాణికులకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సులు ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఎక్కకుండా నిర్దేశించిన ప్రదేశాలలోనే బస్సులు ఎక్కాలని తెలిపారు. ఇలా చేయకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే బస్ డ్రైవర్లు, కండక్టర్లకు సహకరించాలని, వాహనాలపై ప్రయాణించే విద్యార్థులు కూడా తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు పక్కన నడుస్తున్నప్పుడు గుంపులుగా వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా నడవాలని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ట్రాఫిక్ నియమాలపై చైతన్యం పెంపొందించి రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యమని తెలిపారు.