కేంద్ర ప్రభుత్వంపై వామపక్షాల తీవ్ర విమర్శలు: పెరిగిన ఇంధన ధరలతో ప్రజలపై మోయలేని భారం!
31/May/2026 21:39
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల పై ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పెట్రోల్, డీజిల్, సిఎన్జి, మరియు గ్యాస్ ధరలు పెంచి విపరీతమైన బారాలు మోపిందని వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు ఇచ్చిన ఆందోళన కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో అమలు చేయుటకు ఆదివారం నాడు సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో వామపక్ష పార్టీల జిల్లా నాయకులు సమావేశం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు అధ్యక్షత న జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ బండను 950 రూపాయలు పెంచిందని, గృహ వినియోగ గ్యాస్ ధరను కూడా పెంచిందన్నారు.ఐదు రాష్ట్రాలు ఎన్నికలు పూర్తయ్యాక గత 15 రోజుల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు తొమ్మిది రూపాయలు పైబడి ధరలను పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేసిందని సమావేశం అభిప్రాయపడింది. జూన్ 1 నుండి 8వ తేదీ వరకు జిల్లాలో పెంచిన పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలను తగ్గించాలని కేజీ బేసిన్లో లభ్యమవుతున్న గ్యాస్ లో 50శాతం ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించాలని కోరుతూ ప్రసార ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. జూన్ 9వ తేదీన ఏలూరు జిల్లా కేంద్రం తో పాటు జిల్లాలో ఉన్న అన్ని పట్టణ, మండల కేంద్రాలలో వామపక్షాలు పార్టీలు రాస్తారోకో తదితర నిరసన కార్యక్రమాలు చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. సమావేశంలో పాల్గొన్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు యు. వెంకటేశ్వరరావు (యు వి), సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ (చంద్రన్న వర్గం) జిల్లా నాయకులు ఎస్ బాల సుందరం మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, సిఎన్జి, గ్యాస్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలని, కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే చమురు గ్యాస్ లో 50శాతం ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రష్యా మరియు ఇరాన్ నుండి ఆయిల్, గ్యాస్ కొనుగోలు ను కొనసాగించాలని, వాణిజ్య గ్యాస్ ను పాత ధరలకే కేంద్ర ప్రభుత్వం విక్రయించాలని, పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పడిన భారాలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు లక్షల కోట్ల లాభాలని కట్టబెడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు. ఏలూరు జిల్లాలో వామపక్ష పార్టీలు జూన్ 1 నుండి 8 వరకు నిర్వహిస్తున్న ప్రసార ఆందోళన కార్యక్రమాలలో అలాగే జూన్ 9న జరిగే రాస్తారోకో నిరసన కార్యక్రమాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. వామపక్ష పార్టీల నాయకుల సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కే శ్రీనివాస్, సిపిఐ జిల్లా నాయకులు ఉప్పులూరి హేమశంకర్, రెడ్డి శ్రీనివాస్ డాంగే, కురెళ్ళ వరప్రసాద్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ (చంద్రన్న వర్గం) నాయకులు కే సుందరం పాల్గొన్నారు.