వైభవంగా శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ట-పాల్గొన్న అనకాపల్లి ఎం.పీ డాక్టర్ సి.ఎం రమేష్
08/March/2026 19:26
Share:
ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి నూతన ఆలయ పునఃప్రతిష్ట మరియు రాజగోపుర కలశ ప్రతిష్ట మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక గవరపాలెంలో వెలసిన అమ్మవారి ఈ మహోత్సవంలో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ గారు సతీమణి శ్రీదేవి గారితో కలిసి పాల్గొన్నారు.ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఎంపీ గారి దంపతులకు స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మేళతాళాలు మరియు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన పసిడి కలశాల నీరాజనం, కలశ ప్రతిష్టా కార్యక్రమాల్లో వారు శాస్త్రోక్తంగా పాలుపంచుకున్నారు.అమ్మవారిని దర్శించుకున్న సీఎం రమేష్ గారు దంపతులు పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలు సమర్పించి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ పూజా కార్యక్రమంలో శాసనసభాధిపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు సతీమణి పద్మావతి గారితో కలిసి పాల్గొన్నారు.అలాగే ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ దంపతులు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర దంపతులు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, ఆలయ చైర్మన్ పీలా నాగ శ్రీను తదితరులు తమ సతీమణులతో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో పులకించింది. కోలాటాలు, శక్తి వేషధారణలు, భరతనాట్య ప్రదర్శనలు మరియు కేరళ డప్పు వాయిద్యాల హోరుతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది.భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో అనకాపల్లి పురవీధులు కిక్కిరిసిపోయాయి