సాగులో సరికొత్త ప్రయోగం: పైన సొరకాయలు.. కింద చేపలు!
06/March/2026 19:18
Share:
అనకాపల్లి. క్రైమ్ అనాలసిస్:A. Srinivasa Rao,జిల్లా ఇన్చార్జి, వ్యవసాయం అంటే కేవలం నేల మీదే చేయాలనే నియమం ఏమీ లేదు. కాస్త వినూత్నంగా ఆలోచిస్తే పొలం కంటే చెరువే ఎక్కువ కాసులు కురిపిస్తుందని నిరూపిస్తున్నారు ఒడిశాలోని రతన్‌పూర్ గ్రామానికి చెందిన రైతు హిరోద్ పటేల్. ఒకే చోట రెండు రకాల పద్ధతులతో ఏకకాలంలో ఆదాయం పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పదెకరాల్లో అద్భుత సృష్టి హిరోద్ పటేల్ వ్యవసాయ శాఖ సాయంతో తన 10 ఎకరాల పొలంలో నాలుగు చెరువులు తవ్వించారు. వాటి గట్లపై పండ్ల మొక్కలు నాటారు. అయితే, ఆయన ఆలోచన అంతటితో ఆగిపోలేదు. అందులో ఒక చెరువు పైన వెదురు బొంగులతో ఓ పెద్ద పందిరి వేసి, దానిపై సొరకాయ పాదులు పారించారు. ఒకవైపు పైన పందిరికి సొరకాయలు పండుతుంటే, కింద చెరువులో చేపల పెంపకం చేపట్టారు. కేవలం 120 మొక్కలతో ఒకే సీజన్‌లో ఏకంగా 1,800 సొరకాయలు పండించారు. దీని ద్వారా ఆయనకు రూ. 35 వేల అదనపు ఆదాయం లభించింది. మొక్కలు పందిరిపై ఉండటం వల్ల గాలి, సూర్యరశ్మి పుష్కలంగా అందుతాయి. అలాగే చెరువులోని తేమ కారణంగా మొక్కలకు పదే పదే నీరు పెట్టాల్సిన అవసరం (ఇరిగేషన్) తప్పుతుంది. పడవలో కూరగాయల కోత: విశేషం ఏమిటంటే, చెరువు పైన వేలాడే సొరకాయలను కోయడానికి హిరోద్ స్వయంగా ఒక చెక్క పడవను తయారు చేసుకున్నారు. ఆ పడవపై విహరిస్తూనే ఆయన తన పంటను సేకరిస్తారు. ఆయన చేపట్టిన ఈ వినూత్న వ్యవసాయ విధానం ఇప్పుడు శాస్త్రవేత్తలను, ఇతర రైతులను సైతం ఎంతగానో ఆకర్షిస్తోంది. సుస్థిర వ్యవసాయానికి (Sustainable farming) ఇదొక అద్భుతమైన మోడల్ అని పలువురు ప్రశంసిస్తున్నారు. (old news)