టిడ్కో దరఖాస్తుదారులకు శుభవార్త: రూ.174 కోట్ల రీఫండ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

టిడ్కో దరఖాస్తుదారులకు శుభవార్త: రూ.174 కోట్ల రీఫండ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

20/March/2026 07:36    Share:   

అమరావతి: గత ప్రభుత్వ హయాంలో టిడ్కో (TIDCO) ఇళ్ల కోసం నగదు చెల్లించి, ఫ్లాట్ల కేటాయింపు జరగక ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులకు ఊరటనిస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారికి వారి సొమ్మును తిరిగి చెల్లించాలని (రీఫండ్) అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖపై క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పి. నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సురేష్ కుమార్, సీడీఎంఏ డైరెక్టర్ శ్రీ సంపత్ కుమార్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.'
రూ.174 కోట్ల రీఫండ్: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 83,865 మంది దరఖాస్తుదారులకు సంబంధించి రూ.174 కోట్లను వెంటనే వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
1.01 లక్షల ఇళ్ల పంపిణీ: రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 1,00,875 టిడ్కో ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
గృహప్రవేశాలకు ఏర్పాట్లు: కేటాయింపులు పూర్తయిన వెంటనే లబ్ధిదారులు సామూహికంగా గృహప్రవేశాలు చేసేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించి, ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణం మరియు మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం లేకుండా చూడాలని, లబ్ధిదారులకు త్వరితగతిన న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Breaking News

Subscribe our Newsletter