AISF ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా భారీ ఉద్యమాలకు శ్రీకారం చుడతాం ..
08/April/2026 06:30
Share:
విద్యను వ్యాపారంగా మారుస్తున్న విధానాలకు వ్యతిరేకంగా AISF ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా భారీ ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. డి. శివ కుమార్ ఏఐఎస్ఎఫ్ - ఏలూరు జిల్లా అధ్యక్షులు కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా రంగానికి ఒక కొత్త దిశా నిర్దేశం జరిగింది. విద్యలో పారదర్శకత, బాధ్యత, నిపుణుల ఆధిపత్యం అవసరాన్ని గుర్తించి ఉన్నత విద్యా మండలి (APSCHE)ను ఏర్పాటు చేయడం ద్వారా విద్యా వ్యవస్థను రాజకీయ జోక్యాల నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఈ వ్యవస్థ దాదాపు నాలుగు దశాబ్దాలుగా విద్యార్థుల ఆశయాలకు అద్దం పట్టుతూ, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరీక్షలు, ప్రవేశాలు, విద్యా విధానాలను సమన్వయం చేస్తూ వచ్చింది. అయితే, అదే వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఉన్న ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు ఈ వ్యవస్థను బలహీనపరచే దిశగా సాగుతున్నాయి. ఇది కేవలం పరిపాలనా మార్పు మాత్రమే కాదు, ఉన్నత విద్య భవిష్యత్తుపై మబ్బులు కమ్ముకునే సంకేతం. విశ్వసనీయత లేని వ్యవస్థతో మరింత పతనం విశ్వసనీయత లేని CHE లాంటి వ్యవస్థతో ఉన్నత విద్య మరింత పతనం దిశగా వెళ్తోందన్న ప్రమాద సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్: 03 ప్రకారం ఉన్నత విద్యా కమిషనర్ (CHE)కు విస్తృత అధికారాలు కట్టబెట్టడం ద్వారా, ఇంతకాలం నిపుణుల ఆధ్వర్యంలో నడిచిన వ్యవస్థను పూర్తిగా పరిపాలనా అధికారుల ఆధీనంలోకి తీసుకురావడం జరుగుతోంది. ప్రైవేట్ డిగ్రీ, బి.ఎడ్, బి.పి.ఎడ్, పీజీ కాలేజీల అనుమతులు, కోర్సుల ప్రారంభం, అడ్మిషన్ల కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు, ఫీజుల పర్యవేక్షణ ఇవన్నీ ఒకే కేంద్రంలో కేంద్రీకృతం చేయడం పారదర్శకతను తగ్గించే ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యావేత్తల భాగస్వామ్యం లేకుండా తీసుకునే నిర్ణయాలు అకడమిక్ నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా, విద్యను ఒక వ్యాపార వస్తువుగా మార్చే అవకాశాన్ని పెంచుతాయి.ఈ మార్పులతో విద్యార్థుల సమస్యలు వినిపించే వేదికలు క్రమంగా తగ్గిపోతాయి. ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో నడిచే వ్యవస్థలో సాధారణ విద్యార్థికి అపాయింట్మెంట్ పొందడం కూడా కష్టసాధ్యం అవుతుంది. ఇది పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు విద్యా అవకాశాలను మరింత దూరం చేసే ప్రమాదం ఉంది. విద్యా వ్యవస్థలో సమానత్వం అనే లక్ష్యం నెరవేరాలంటే, నిర్ణయాలు తీసుకునే స్థాయిలో విద్యావేత్తల పాత్ర తప్పనిసరి. పరీక్షలు ప్రవేశాల ప్రక్రియ విభజనతో వ్యవస్థలో అసమతౌల్యం ప్రస్తుతం EAPCET, ICET, OAMDC, PGECET, EdCET, LawCET వంటి పరీక్షలను APSCHE నిర్వహిస్తూనే, అడ్మిషన్లు మరియు కౌన్సెలింగ్ బాధ్యతలను CHEకి అప్పగించడం ఒక తీవ్రమైన విధాన విరుద్ధత. పరీక్షలు మరియు ప్రవేశాలు ఒకదానితో ఒకటి అనుసంధానమైన ప్రక్రియలు. వీటిని వేర్వేరు సంస్థల చేతుల్లో ఉంచడం వల్ల సమన్వయం లోపించి, విద్యార్థులు సాంకేతిక సమస్యలు, ఆలస్యం, అన్యాయాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.ఇంకా, విశ్వవిద్యాలయాలు ప్రభుత్వానికి పంపే ఫైళ్లు, అలాగే ప్రభుత్వ ఫైళ్లు కూడా CHE ద్వారా మాత్రమే వెళ్లే విధానం అమలు చేస్తే, APSCHE స్వయం ప్రతిపత్తి పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఇది విద్యా వ్యవస్థలో ప్రజాస్వామ్య నియంత్రణను తగ్గించి, అధికార కేంద్రీకరణను పెంచుతుంది. ఫీజుల నిర్ణయంలో కూడా పారదర్శకత తగ్గిపోవడం వల్ల విద్యార్థులపై ఆర్థిక భారం పెరిగే ప్రమాదం ఉంది. ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన అన్ని అనుమతులను ఒకే అధికారి ద్వారా ఇవ్వడం వల్ల, నియంత్రణ వ్యవస్థలో లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంతవరకు ఉన్న నిపుణుల సమీక్ష, అకడమిక్ ప్రమాణాల పరిశీలన వంటి అంశాలు తగ్గిపోతే, ప్రైవేట్ విద్యారంగం పూర్తిగా వ్యాపార ధోరణికి లోనవుతుంది. ఇది విద్యా నాణ్యతను దెబ్బతీసే ప్రధాన కారణంగా మారుతుంది.ప్రభుత్వం చెబుతున్నట్లుగా “సులభతరం” అనే పేరుతో తీసుకొస్తున్న ఈ మార్పులు, వాస్తవానికి “స్వేచ్ఛా వాణిజ్యం”కు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. విద్య ఒక హక్కు, అది వ్యాపార సాధనం కాదనే మౌలిక సూత్రాన్ని మరచిపోవడం సమాజానికి ప్రమాదకరం. ప్రజాస్వామ్యయుత చర్చలతోనే బాధ్యతాయుత నిర్ణయాలకు అవకాశం దాదాపు 40 సంవత్సరాలుగా సమర్థవంతంగా పనిచేస్తున్న APSCHE వ్యవస్థను ఒక్కసారిగా మార్పులు చేయడం సమంజసం కాదు. విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు, విశ్వవిద్యాలయాలు, ప్రజాప్రతినిధులతో సమగ్ర చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవాలి. ఉన్నత విద్యా ప్రక్షాళన అంశంలో రిటైర్డ్ IAS రెడ్డి సుబ్రహ్మణ్యం తదితర సభ్యుల కమిటీ నివేదికను తక్షణమే బహిర్గతం చేసి, మంత్రివర్గంలో చర్చించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత, చర్చ అనే మూడు మూలస్తంభాలు తప్పనిసరి. ఈ సూత్రాలను పక్కన పెట్టి తీసుకునే నిర్ణయాలు ఎప్పటికీ ప్రజల మన్ననలు పొందవు. ఉన్నత విద్యను నిర్వీర్యం చేసే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకపోతే విద్యార్థి సమాజం తరఫున ఉద్యమాలు అనివార్యం అవుతాయి.ఉన్నత విద్యా రంగాన్ని పరిరక్షించడం ప్రతి బాధ్యతాయుత పౌరుడి కర్తవ్యంగా భావించాలి. APSCHE స్వయం ప్రతిపత్తిని కాపాడటం అంటే విద్యలో న్యాయం, సమానత్వం, పారదర్శకతను కాపాడటమే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను వెంటనే పునఃసమీక్షించి, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేయాలి.ఈ జీవోలను వెంటనే ఉపసంహరించకపోతే, AISF ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా భారీ ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. విద్యను వ్యాపారంగా మారుస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా పోరాటం కొనసాగుతుంది.