ఏలూరు.జిల్లాలో "వన్ మంత్.. వన్ విలేజ్.. 4 విజిట్స్" కార్యక్రమం ప్రారంభం
06/May/2026 20:50
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
జిల్లాలో "వన్ మంత్... వన్ విలేజ్... 4 విజిట్స్" కార్యక్రమాన్ని ప్రతీ నెల ఒక గ్రామంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి బుధవారం "వన్ మంత్... వన్ విలేజ్... 4 విజిట్స్" కార్యక్రమం నిర్వహణపై రెవిన్యూ అధికారులకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రధానంగా రెవిన్యూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం "వన్ మంత్... వన్ విలేజ్... 4 విజిట్స్" కార్యక్రానికి రూపకల్పన చేసిందన్నారు. మండల తహసీల్దార్లు తమ పరిధిలోని గ్రామాలలో నెలకు ఒక గ్రామంలో వారానికి ఒక రోజు చొప్పున 4 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి, ఆ గ్రామంలో సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేలా పనిచేయాలన్నారు. ముందుగా మండల పరిధిలో రెవిన్యూ, ఇతర శాఖలకు సంబందించిన సమస్యలు ఎక్కువగా ఉన్న గ్రామాన్ని గుర్తించాలని, రీ సర్వే జరిగిన గ్రామానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈనెల 7వ తేదీ గురువారం ఆ గ్రామంలో పర్యటించి గ్రామ సమస్యలను గుర్తించాలని, అనంతరం ఆ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ప్రజల నుండి రెవిన్యూ, తదితర అంశాలపై వారి సమస్యలకు సంబందించిన వినతి పత్రాలను స్వీకరించి, వాటిల్లో అక్కడికక్కడే పరిష్కరించే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మిగిలిన వినతులను ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. ఆ గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములు, చెరువులు పరిశీలించాలన్నారు. తదుపరి గురువారం సర్వే రికార్డుల ప్రకారం ఆ గ్రామంలోని భూములు, చెరువులు వంటి వాటిని గుర్తించాలన్నారు. ప్రజలు అందించి ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలను పరిశీలించాలన్నారు. 3వ గురువారం ప్రజల ఫిర్యాదులకు సంబంధించి మ్యుటేషన్, ఆర్ ఓ ఆర్ సవరణలు, తదితర ఫిర్యాదుల పరిష్కారం చర్యలను ఫిర్యాదీదారులకు తెలిజేసి, సంబంధింత ఉత్తరువులను అందించాలన్నారు. 4వ గురువారం గ్రామంలో గ్రామ సభ నిర్వహించి పరిష్కరించిన ప్రజల ఫిర్యాదుల వివరాలను తెలియజేయాలని, పరిష్కార విధానంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. కోర్ట్ లలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల మినహా గ్రామంలో రెవిన్యూ సమస్యలు లేకుండా పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆ నెలలో సంబంధిత గ్రామంలో సమస్యలు అనేవి లేకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 7వ తేదీ గురువారం నుండి జిల్లావ్యాప్తంగా ప్రతీ మండలంలోనూ ఒక గ్రామంలో ప్రారంభం కావాలన్నారు. "వన్ మంత్... వన్ విలేజ్... 4 విజిట్స్" కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఏ నెలలో ఏ గ్రామంలో నిర్వహించేది ముందుగానే ప్రజలకు సమాచారం అందించాలని, "వన్ మంత్... వన్ విలేజ్... 4 విజిట్స్ కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు కిషోర్, రమణ, మండలాల తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.