అనకాపల్లి జిల్లా ప్రతినిధి: జిల్లాలో మలేరియా వ్యాధిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ సమాయత్తమైంది. ఇందులో భాగంగా ఈ నెల 15 (బుధవారం) నుండి మే 15 వరకు జిల్లావ్యాప్తంగా 'ఇంటి లోపల దోమల సంహారిణి పిచికారీ' (IRS-2026) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు
145 గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్:గత ఏడాది జిల్లాలో 397 మలేరియా కేసులు నమోదైన నేపథ్యంలో, ఈసారి వ్యాధి ఉధృతి ఎక్కువగా ఉన్న 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) పరిధిలోని 145 గ్రామాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో దోమల నియంత్రణే లక్ష్యంగా ముమ్మరంగా పిచికారీ చేయనున్నారు.
అధికారుల పర్యవేక్షణ:జిల్లా మలేరియా అధికారి శ్రీ వరహాలు దొర పర్యవేక్షణలో ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే తగిన సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ.. "మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు సహకరించాలి. సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు పిచికారీ చేయించుకోవాలి. దోమల వ్యాప్తిని అరికట్టడం ద్వారానే ప్రాణనష్టాన్ని నివారించగలం" అని పేర్కొన్నారు.