- నాలుగు కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు యలమంచిలి : రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 (సోమవారం) నుండి ప్రారంభం కానున్న పదో తరగతి ప్రభుత్వ పరీక్షల కోసం యలమంచిలి పట్టణంలోని నాలుగు పరీక్షా కేంద్రాలు సర్వం సిద్ధమయ్యాయి. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విద్యాశాఖ అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి కేంద్రంలోనూ చల్లని తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. విద్యార్థులకు సరిపడా బెంచీలు, ఫ్యాన్లు, వెలుతురు ఉండేలా గదులను సిద్ధం చేస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణమే స్పందించేందుకు ప్రతి సెంటర్ వద్ద ఒక ఏఎన్ఎం, ప్రాథమిక చికిత్స కిట్‌లను అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి. విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుండే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి అనుమతించరు. సెంటర్లకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పరీక్ష పత్రాలు పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. ఇప్పటికే ఇన్విజిలెటర్లను నియమించి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ పర్యాయం ప్రయివేటు టీచర్లను కూడా నియమించారు. పరీక్ష సెంటర్ ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి ఐదు వరకు తరగతులు నిర్వహిస్తారు. అలాగే ఓపెన్ టెన్త్ క్లాస్ పరీక్షలు సోమవారం నుండే ప్రారంభం అవుతున్నాయి. సేయింట్ మరీస్, గర్ల్స్ హై స్కూల్ ల్లో వీటికి రెగ్యులర్ తో పాటు సెంటర్లు ఇచ్చారు.