జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో  రూ.134.27 కోట్లు జమ.

జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.134.27 కోట్లు జమ.

14/March/2026 14:23    Share:   

జిల్లా వ్యాప్తంగా రూ.134.27 కోట్లు రైతుల ఖాతాల్లో జమ జిల్లా కలెక్టర్  శ్రీమతి విజయ క్రిష్ణన్
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - అగ్రికల్చర్, ఇండస్ట్రీల కలయికతో జిల్లా అభివృద్ధి
అనకాపల్లి, మార్చి 13:  అన్నదాత సుఖీభవ - పిఎం కిసాన్ పథకం కింద జిల్లావ్యాప్తంగా రూ.134.27 కోట్ల నిధులు 2,42,536 మంది రైతుల ఖాతాల్లో నేడు జమ కానున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి  అన్నదాత సుఖీభవ - పిఎం కిసాన్ మూడవ విడత పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక అనకాపల్లి పట్టణం గుండాల వీధి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన (ఆర్ ఎ ఆర్ ఎస్ ) కేంద్రంలో శుక్రవారం సాయంత్రం స్థానిక శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, రైతులతో కలసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయం, హార్టికల్చర్, పరిశ్రమలు, మైనింగ్ వంటి అన్ని రంగాలు కీలకమైనప్పటికీ, ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని  పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 50 శాతం మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నందున, రైతు సంక్షేమమే ధ్యేయంగా పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
గత ఏడాది కాలంగా స్థానిక శాసనసభ్యులు చోరవతో జిల్లా యంత్రాంగం చేపట్టిన సాగునీటి కాలువల పూడికతీత,  ​జల వనరుల సంరక్షణ -పనులపై  ప్రత్యేక ప్రశంసలు తెలిపారు. ఐదు-ఆరేళ్ల విరామం తర్వాత 'వాటర్ యూజర్ అసోసియేషన్స్' పునరుద్ధరించి, సాగునీటి నిర్వహణను మెరుగుపరిచారని కలెక్టర్ అన్నారు. గతంలో శంకరం వంటి ప్రాంతాలు వరదలతో తీవ్రంగా మునిగిపోయేవని, వేసవిలోనే ప్రధాన కాలువలు, చెరువుల్లో పూడికతీత (డీసిల్టేషన్) పనులు పూర్తి చేయడం వల్ల ఈ ఏడాది భారీ వర్షాలు కురిసినా పంట నష్టం కలగలేదని వివరించారు. ఇరిగేషన్,  అగ్రికల్చర్,  మైనింగ్ మరియు డ్వామా (DWMA) శాఖలు సమన్వయంతో పని చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.
​రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జల వనరులను కాపాడుకోవడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు (NGOs) సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మన ఊరిలోని నీటి వనరులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం రైతులందరికీ భరోసా ఇస్తుందని , రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని అన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ మరియు ఇతర నగర ఉద్యోగాల నుండి రిటైర్ అయిన వారు కూడా తిరిగి గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నారని, ఇది శుభపరిణామమని అన్నారు. "నేను ఒక రైతును" అని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలని, సమాజంలో రైతులకు ఇచ్చే గౌరవం పెరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివీఎన్ మాధవ్,  గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్లా సురేంద్ర, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ,మరియు ఇతర రాజకీయ ప్రముఖులు, అధికారులు పెద్ద ఎత్తున రైతులు  హాజరయ్యారు.
Breaking News

Subscribe our Newsletter