విషాదం నుంచి విజయం వైపు: ప్రకృతి సేద్యంతో రైతు జ్యోతి అద్భుత ప్రస్థానం
09/February/2026 17:45
Share:
విషాదం నుంచి విజయం వైపు: ప్రకృతి సేద్యంతో రైతు జ్యోతి అద్భుత ప్రస్థానం యూరప్ దేశాలతో పాటు మొత్తం 7 దేశాల్లో తన అనుభవాల ద్వారా రైతులకు దిశానిర్దేశం చేయడానికి జ్యోతి ఎంపిక
గంటా గోవింద్. ఎడిటర్, ప్రకృతి వ్యవసాయం. అనకాపల్లి, ఫిబ్రవరి 9: అనకాపల్లి జిల్లా సంతపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి జ్యోతి ప్రకృతి వ్యవసాయంలో వినూత్న వ్యవసాయ పద్ధతులను అవలంబించి విజయం సాధించారని, వారి ప్రతిభను గుర్తించిన రైతు సాధికార సంస్థ (RYSS), ఆమె అనుభవాలను అంతర్జాతీయ స్థాయిలో పంచుకోవాలని నిర్ణయించిందని, ఇందులో భాగంగా యూరప్ దేశాలతో పాటు మొత్తం 7 దేశాల్లో తన అనుభవాల ద్వారా రైతులకు దిశానిర్దేశం చేయడానికి ఆదర్శరైతు జ్యోతిని ఎంపిక చేయడం జరిగిందని రైతు సాధికార సంస్థ, గుంటూరు, ఎగ్జిక్యూటివ్ వైస్ చెైర్మన్ మరియు వ్యవసాయశాఖ ప్రభుత్వ సలహాదారు పి. విజయ్ కుమార్ తెలిపారు. ఆరోగ్యమే ఆయుధంగా మార్చుకున్న ఆదర్శ మహిళా రైతు ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా సంతపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి జ్యోతి ప్రస్థానం ఎందరో యువతకు స్ఫూర్తిదాయకం. చదువు ముగించుకుని విజయవాడలోసిన్నైట్ టెక్నాలజీఅను సాఫ్ట్ వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ (HR) ప్రొఫెషనల్‌గా స్థిరపడిన ఆమె, గర్భధారణ సమయంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా తిరిగి తన గ్రామానికి చేరుకోవాల్సి వచ్చింది. గర్భవతిగా ఉన్న సమయంలో తన బిడ్డ సరైన బరువు పెరగకపోవడంతో, మనం తినే ఆహారంలోని నాణ్యత మరియు పోషకాల గురించి ఆమె తీవ్రంగా ఆలోచించారు. రసాయనాలతో పండించే పంటల వల్ల కలిగే నష్టాలను గమనించి, తన కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో రసాయన రహిత వ్యవసాయం వైపు అడుగులు వేశారు. మొదట్లో దిగుబడి తగ్గుతుందేమోనన్న భయంతో తన మామగారు అడ్డుచెప్పినప్పటికీ, రైతు సాధికార సంస్థ వారి అద్వర్యంలో సంతపల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సుల ద్వారా ఆమె ప్రకృతి వ్యవసాయంపై గట్టి నమ్మకాన్ని పెంచుకున్నారు. పట్టుదల తోడై రైతు శాస్త్రవేత్తగా సరికొత్త అవతారం ఆమె తన వ్యవసాయాన్ని కేవలం ఒక అలవాటుగా కాకుండా, ఒక విజ్ఞాన శాస్త్రంగా భావించారు. 2020లో కేవలం 0.10 ఎకరంలో ప్రారంభించిన ప్రయోగం, నేడు ఆమెను ఒక "రైతు శాస్త్రవేత్త"గా నిలబెట్టింది. ఆగస్టు 2024లో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీలో మెంటార్ గా బాద్యతలు చేపట్టారు ఆమె, తన పొలాన్ని ఒక అభ్యాస ప్రయోగశాలగా మార్చుకున్నారు. ప్రతి పెట్టుబడిని, సాగు ఖర్చును మరియు నేల ఆరోగ్యాన్ని నిశితంగా రికార్డు చేస్తూ, ప్రకృతి వనరులైన జీవామృతం, బీజామృతం మరియు మల్చింగ్ పద్ధతులను సమర్థవంతంగా అమలు చేశారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పురుగుల ఉధృతి తగ్గడమే కాకుండా, నేల సారం కూడా గణనీయంగా పెరిగింది. ఆదాయం మరియు సాగులో అద్భుత విజయాలు ప్రకృతి వ్యవసాయం జ్యోతి కుటుంబ ఆర్థిక పరిస్థితిని సమూలంగా మార్చివేసింది.ఒకప్పుడు అనిశ్చితమైన లాభాలతో ఉన్న వారి వ్యవసాయం, ఇప్పుడు స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఆమె వార్షిక ఆదాయం గతంలో ₹63,700 ఉండగా, ఇప్పుడు అది ₹2,00,540కి పెరిగింది. ఆశ్చర్యకరంగా సాగు ఖర్చులు 42 శాతం నుంచి 12 శాతానికి పడిపోయాయి. నీటి పొదుపు విషయంలోనూ ఆమె విజయం సాధించారు; గతంలో 40 సార్లు తడులు అందించాల్సి రాగా, భూసారం మెరుగుపడటం వల్ల ఇప్పుడు కేవలం 15 సార్లు మాత్రమే అవసరమవుతోంది. కేవలం ఒకే రకమైన పంటకు పరిమితం కాకుండా, 42రకాలకు పైగా పంటలను పండిస్తూ వైవిధ్యాన్ని చాటారు. వినూత్న నమూనాలతో సుస్థిర ఆర్థిక ప్రగతి ఆమె అనుసరించిన ఏ గ్రేడ్ (A Grade) మరియు ఏటీఎం (ATM) నమూనాలు ఆమె విజయంలో కీలక పాత్ర పోషించాయి.ఒక ఎకరంలో కొబ్బరిని ప్రధాన పంటగా పండించారు. బొప్పాయి, అరటి, నిమ్మ, మామిడి, జామ వంటి పండ్ల పంటలతో పాటు. వంకాయ, మిరప, టమోటా, బీన్స్, బెండ , అలచంద , మొక్కజొన్న మరియు బంతి పువ్వు వంటి కూరగాయల కోసం ఒక ప్రత్యేక బ్లాక్‌లలో పంటలు పండిస్తూ భూమిని విస్తృతంగా వినియోగించుకున్నారు. అలాగే 0.20 ఎకరంలో 'ఎనీ టైమ్ మనీ' (Any Time Money) నమూనా ద్వారా నిరంతరం ఆదాయాన్నిచ్చే 25 రకాల ఆకుకూరలు, కూరగాయలు మరియు దుంపలను సాగు చేస్తూ కుటుంబ పోషణకు ఎటువంటి లోటు లేకుండా చేసుకున్నారు. "ప్రకృతి వ్యవసాయం నా నేలను పునరుజ్జీవింపజేయడమే కాకుండా, నాకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చింది" అని జ్యోతి సగర్వంగా చెబుతున్నారు. నేడు ఆమె తన అనుభవాలను తోటి రైతులతో పంచుకుంటూ గ్రామాల్లో మార్పుకు నాయకత్వం వహిస్తున్నారు. బొబ్బిలి జ్యోతి కృషి కేవలం అనకాపల్లి జిల్లా సంతపల్లికి మాత్రమే పరిమితం కాలేదు. ఆమె అవలంబిస్తున్న వినూత్న వ్యవసాయ పద్ధతులను గుర్తించినరైతు సాధికార సంస్థ (RYSS), ఆమె అనుభవాలను అంతర్జాతీయ స్థాయిలో పంచుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా యూరప్ దేశాలతో పాటు మొత్తం 7 దేశాల్లో తనఅనుభవాలను ద్వారా రైతులకు దిశానిర్దేశం చేయడానికి జ్యోతి గారు ఎంపిక కావడం మనందరికీ గర్వకారణమని ఆయన తెలిపారు. జారీః జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, అనకాపల్లి