చైర్‌లో కూర్చున్నాడనే కారణంతో దళితుడిపై దారుణ దాడి.. కుల దూషణలతో రక్తపాతం!”
అనకాపల్లి జిల్లా, మే 21 (క్రైమ్ అనాలిస్ రిపోర్టర్ ఆనంద్):
కోటవురట్ల మండలం ఎండపల్లి అన్నవరం గ్రామంలో దళిత వ్యక్తిపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన పెదపూడి రాంబాబు అనే దళిత వ్యక్తి చైర్‌లో కూర్చున్నాడనే కారణంతో అగ్రకులానికి చెందిన దుబాసి సురేష్ అనే వ్యక్తి కుల దూషణలకు దిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.
“నా ముందే కూర్చుంటావా.. ఎడమ చేయికి కుడి చేయికి తేడా లేదా” అంటూ కులం పేరుతో అవమానిస్తూ, కర్రతో రాంబాబు తలపై బలంగా దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో రాంబాబుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడే రక్తస్రావం జరిగింది. బాధితుడి భార్య గంగమ్మ కన్నీటి పర్యంతమై కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోగా నిందితుడు పరారైనట్లు తెలిసింది.
సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే డిహెచ్పిఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. డి.సీహెచ్ రాజబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి. లోవరాజు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. అనంతరం కోటవురట్ల పోలీస్ స్టేషన్‌లో బాధితుడితో ఫిర్యాదు చేయించారు.
తలకు తీవ్ర గాయం కావడంతో బాధితుడిని విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించినట్లు నాయకులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కోటవురట్ల ఎంపీటీసీ పి. సత్తిబాబు, దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.