రైతులకు సర్కారు భారీ భరోసా.. సగం ధరకే సాగు యంత్రాలు! ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం రాయితీ..
09/May/2026 07:25
Share:
ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ మే 19 వరకు దరఖాస్తులకు అవకాశం ఈ-సీడ్ (e-Seed) పోర్టల్ లేదా ఆర్బీకేల ద్వారా దరఖాస్తుల స్వీకరణ....
శ్రీనివాస్ ఏ క్రైమ్ ఎనాలిసిస్, జిల్లా ఇన్చార్జ్.అనకాపల్లి.
వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించి, సాగు ఖర్చులను తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడంలో భాగంగా రైతులకు భారీ రాయితీపై (సబ్సిడీ) సాగు పరికరాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ట్రాక్టర్లు మొదలుకొని చిన్నపాటి సస్యరక్షణ యంత్రాల వరకు అన్నీ సబ్సిడీపై అందించనున్నారు. 2025-26 సంవత్సరానికి గాను ఈ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. రాయితీ వివరాలు.. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు మరియు మహిళా రైతులకు పరికరాల కొనుగోలుపై గరిష్టంగా 50 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కింద ట్రాక్టర్లు, సీడర్లు, రోటావేటర్లు, పవర్ టిల్లర్లు, హార్వెస్టర్లు, వివిధ రకాల స్ప్రేయర్లు, కలుపు తీసే యంత్రాలు (వీడర్లు), బ్రష్ కట్టర్లతో పాటు సస్యరక్షణకు ఉపయోగించే ఆధునిక కిసాన్ డ్రోన్లను కూడా రైతులు సొంతం చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం మరియు అర్హతలు.. సొంత భూమి ఉన్న రైతులు, ఈ-క్రాప్ లో నమోదైన వారు, అలాగే సీసీఆర్సీ (CCRC) లేదా ఆర్‌ఎఫ్‌ఆర్ (RFR) గుర్తింపు పత్రాలు ఉన్న కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులే. ఆసక్తి గల రైతులు తమ గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల (RBK) వద్దనున్న వ్యవసాయ సహాయకుడిని (VAA) సంప్రదించి గానీ, లేదా నేరుగా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://eseed.ap.gov.in ద్వారా గానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారుల ఎంపికలో ఎవరి ప్రమేయం లేకుండా పారదర్శకంగా లాటరీ విధానాన్ని అమలు చేయనున్నారు. షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి: దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ: మే 19 (ప్రస్తుతం కొనసాగుతోంది).లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక: మే 23 నుండి మే 25 వరకు.రైతు (నాన్-సబ్సిడీ) వాటా చెల్లింపు: మే 26 నుండి జూన్ 9 లోపు. యంత్రాల సరఫరా/పంపిణీ: మే 26 నుండి జూన్ 26 వరకు.లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ విడుదల: జూన్ 30న.అర్హులైన రైతులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మే 19వ తేదీ లోపు దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.