
విశాఖపట్నం: నాలుగు దశాబ్దాలకు పైగా తన సహచర పాత్రికేయ మిత్రులతో, ప్రకృతి వ్యవసాయం, సహజ రంగులు, కొయ్య బొమ్మల తయారీ, నూలు వస్త్రాల అద్దకం, పశుపోషణ, చెక్క ఎద్దుగానుగ – ఇలా ఆరోగ్యానికి ఉపకరించే అన్నింటినీ అందుబాటులో ఉంచుతున్న ఆకుల చలపతిరావు (సంకల్ప కళా గ్రామం, పెద్దగాడి) మరియు తులసి నేచురల్స్ తూర్పటి సత్యనారాయణ గారి సహకారంతో, ఇటీవల “శబల” భోజనాల పండుగ స్ఫూర్తితో... సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఆర్.ఎన్. వర్మ తన జీవితంలో మరో అర్థవంతమైన అడుగు ముందుకు వేశారు.ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా, మరింత మెరుగైన ఆరోగ్యం కోసం, చివరి వరకు పదిమందికి ఆరోగ్యంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు నుంచి ‘నవారా బియ్యం’తో స్వయంపాకం చేసి భోజనం చేయడానికి శ్రీకారం చుట్టారు.
ఎరుపు రంగులో ఉండే ఈ బియ్యం కేరళ సాంప్రదాయ ఆయుర్వేద ఔషధంగా ప్రసిద్ధి చెందింది. త్రేతాయుగం నాటిదని చరిత్ర చెప్పే ఈ నవారా విత్తనం, ప్రత్యేకించి షుగర్ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలదు. వివిధ రకాల ఎముకల నొప్పుల నివారణకు ఉపయోగపడుతుంది. అన్ని వయసుల వారికి, ముఖ్యంగా ఆరోగ్యానికి ఇది ఒక మూలస్తంభంగా వర్మ గారు అభివర్ణించారు.
వర్మ గారు పంచుకున్న వంట విధానం ప్రకారం:ఉదయం వండుకోవాలంటే ముందురోజు రాత్రి లేదా సాయంత్రం ఒక గ్లాసు బియ్యం ఒక్కసారి కడిగి, 8 నుండి 10 గ్లాసుల నీళ్లలో 12 నుండి 15 గంటలపాటు నానబెట్టాలి.మరుసటి రోజు నీళ్లు వార్చి, బియ్యం వేసి 90% ఉడికిన తర్వాత గంజి వేరు చేయాలి.మట్టి కుండలో వండుకోవడం ఉత్తమం – ఇందులో కాల్షియం, ఫాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు లభిస్తాయి. అన్ని విటమిన్లు పూర్తిగా అందుతాయి. ఆహారం నెమ్మదిగా ఉడికి పోషకాలు నిలుస్తాయి, రుచి కూడా మెరుగ్గా ఉంటుంది.మట్టి కుండ అందుబాటులో లేకపోతే కంచు లేదా ఇత్తడి పాత్ర ఉపయోగించవచ్చు. తప్పనిసరి పరిస్థితిలో స్టీల్ పాత్ర కూడా వాడవచ్చు.ఎట్టి పరిస్థితుల్లోనూ అల్యూమినియం పాత్ర లేదా ప్రెజర్ కుక్కర్ లో వంట చేయరాదు. ఇది మనిషిని నెమ్మదిగా బలహీనులను చేస్తుందని వర్మ గారు హెచ్చరించారు.
వార్చిన గంజిని మట్టి పాత్రలో ఉంచి, పల్చని బట్ట కప్పి, 12 గంటల తర్వాత లేదా మరుసటి రోజు పల్చటి ఆవుపాల మజ్జిగ కలుపుకుని త్రాగాలి. గంజి మీద మూత పెట్టకూడదు – అలా చేస్తే చెడు బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది.
ప్రకృతి వ్యవసాయ పండితులు విజయరామ్ గారు, ఆయుర్వేద సహజసిద్ధ వైద్యులు డాక్టర్ రవి వర్మ గారితో సహా అనేక మంది దీవెనలతో తాను ఈ అర్థవంతమైన జీవిత లక్ష్యానికి పునాది వేసుకున్నానని వర్మ గారు పేర్కొన్నారు.