గ్రామ సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక చర్యలు...
అనకాపల్లి జిల్లా, మే 15 (క్రైమ్ న్యూస్ ప్రతినిధి):
ఈరోజు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పప్పల చలపతిరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారు మర్యాదపూర్వకంగా కలిసి దుప్పితూరు గ్రామ తరలింపు అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా దుప్పితూరు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నిర్వాసితుల భవిష్యత్తు, పునరావాస ఏర్పాట్లు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
దుప్పితూరు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామంలోని అన్ని సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపించే దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేసినట్లు నాయకులు వెల్లడించారు.