రికార్డు ఆదాయంతో ముగిసిన నూకంబిక అమ్మవారి

రికార్డు ఆదాయంతో ముగిసిన నూకంబిక అమ్మవారి 'నెలపండుగ' 41 రోజుల్లో రూ.2.73 కోట్లు, 51వ రోజున రూ.1.36 కోట్ల ఆదాయం !

01/May/2026 08:26    Share:   

41 రోజుల్లో రూ.2.73 కోట్లు, 51వ రోజున రూ.1.36 కోట్ల ఆదాయం. రూ.200 దర్శనం టికెట్‌పై ఉచిత లడ్డూ ప్రసాదం ఆలయ ప్రాంగణంలో త్వరలో ఐదంతస్తుల నూతన భవనం అభివృద్ధికి సర్కారు పూర్తి సాయం: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
అనకాపల్లి: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, భక్తుల కొంగుబంగారం అనకాపల్లి శ్రీ శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి నెలపండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. భక్తజన సందోహం మధ్య సుమారు నెలన్నర పాటు సాగిన ఈ ఉత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభించింది. నిర్వహణ, ఏర్పాట్ల పట్ల భక్తులతో పాటు దేవస్థానం అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఉత్సవాలకు సంబంధించిన ఆదాయ వివరాలను దేవస్థానం ఈవో, చైర్మన్, దేవాదాయ శాఖ ఏసీ సుధారాణి సంయుక్తంగా వెల్లడించారు. ఉత్సవాల 41 రోజుల వ్యవధిలో వివిధ టికెట్ల విక్రయాల ద్వారా రూ.2 కోట్ల 73 లక్షల ఆదాయం సమకూరగా, 51వ రోజున ప్రత్యేకంగా రూ.1 కోటి 36 లక్షల భారీ ఆదాయం లభించినట్లు వారు తెలిపారు. భక్తుల అశేష రాక, వారి అపార విశ్వాసమే ఈ విజయానికి కారణమని అధికారులు పేర్కొన్నారు.పూర్తి సహకారం అందిస్తాం: ఎమ్మెల్యే కొణతాల
ఉత్సవాల ఆదాయం, నిర్వహణ విజయాలను ఆలయ అధికారులు.. కూటమి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రామ్‌ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల మాట్లాడుతూ.. అమ్మవారి దేవస్థానం సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం, వసతులు కల్పించే దిశగా పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే రూ.200ల టికెట్ కొనుగోలు చేసి దర్శనానికి వెళ్లే భక్తులకు ఒక లడ్డూను ఉచితంగా అందించే నూతన విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.అలాగే, ఆలయ ప్రాంగణంలో భక్తుల బస, ఇతర సౌకర్యాల నిమిత్తం ఐదు అంతస్తుల భారీ భవన నిర్మాణ పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణల చొరవతో ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందనున్నాయని వారు వివరించారు. మొత్తంగా అధికారుల సమర్థ నిర్వహణ, భక్తుల అశేష సహకారంతో ఈ ఏడాది నెలపండుగ ఉత్సవాలు అపూర్వ విజయంగా నిలిచాయని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.
- రిపోర్టింగ్: శ్రీనివాస్ ఏ, క్రైమ్ ఎనాలిసిస్, జిల్లా ఇన్చార్జ్.అనకాపల్లి.
Breaking News

Subscribe our Newsletter