విజయరామపురం అగ్రహారం నిర్వాసితుల ఇళ్లను కూల్చడం దుర్మార్గం సీపీఎం ధ్వజం..!!

విజయరామపురం అగ్రహారం నిర్వాసితుల ఇళ్లను కూల్చడం దుర్మార్గం సీపీఎం ధ్వజం..!!

14/June/2026 02:10    Share:   

క్రైమ్ అనాల్సిస్ : టివియస్ ప్రకాష్ :
​రాంబిల్లి 
ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ నిర్మించకుండా ఖాళీ చేయించడంపై ఆగ్రహం​- అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు..!(జి దేవుడు నాయుడు) 
వి.ఆర్ అగ్రహారం నిర్వాసితులకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన
​రాంబిల్లి  మండలంలోని విజయరామపురం అగ్రహారం గ్రామంలో ఎస్ ఈ జెడ్ రెండో విడత నిర్వాసితుల ఇళ్లను అధికారులు బలవంతంగా కూల్చివేయడంపై సీపీఎం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్వాసితులకు కనీస ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డున పడేయడం కూటమి ప్రభుత్వానికి తగునా అని సీపీఎం మండల కార్యదర్శి జీ దేవుడు నాయుడు నిలదీశారు. స్థానిక రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ​ఈ సందర్భంగా దేవుడు నాయుడు మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో గుడి, బడి, ఆటస్థలం, స్మశాన వాటిక వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే పాత గ్రామం నుంచి నిర్వాసితులను తరలించాల్సి ఉంటుందని చట్టం చెబుతోందని గుర్తుచేశారు. చట్ట నిబంధనలను తుంగలో తొక్కి కూటమి నాయకులు,అధికారులు నిర్వాసితులకు ఇంతటి అన్యాయం చేయడం దారుణమన్నారు.నెల రోజుల క్రితమే ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇప్పుడు ఇళ్లను కూల్చేస్తున్నారు. 'మా సామాన్లు సర్దుకుని, ప్రత్యామ్నాయం చూసుకునేందుకు నెల రోజులు గడువు ఇవ్వండి' అని అధికారులు కాళ్లు పట్టుకున్నా కనీసం కనికారం చూపలేదు. విద్యుత్ సరఫరా నిలిపివేసి, పోలీసు బందోబస్తుతో ఇళ్లను కూల్చివేసి నిర్వాసితులను రోడ్డున పడేశారని తెలిపారు. ​ఈ భూముల్లో ఇప్పటివరకు ఎటువంటి పరిశ్రమా రాకపోయినప్పటికీ, ఆగమేఘాల మీద ఇళ్లను ఎందుకు కూల్చేస్తున్నారని అధికారులను ప్రశ్నిస్తే.. "పై నుంచి ఒత్తిడి వస్తోంది.. మీ అంతట మీరు బయటకు వెళ్తారా? లేక నెట్టేసి కూల్చేయమంటారా?" అని బెదిరింపులకు గురిచేశారని దేవుడు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ సత్యనారాయణ తన రెవెన్యూ సిబ్బంది, పోలీసులతో కలిసి వచ్చి ఈ అమానుషానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ​ప్రస్తుత ప్రభుత్వాలకు పారిశ్రామిక ప్రయోజనాలపై ఉన్న శ్రద్ధ, సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితుల ప్రయోజనాలపై లేదని సీపీఎం నాయకులు విమర్శించారు. ఇదేనా కూటమి ప్రభుత్వం చెప్తున్న అభివృద్ధి అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి విజయరామపురం అగ్రహారం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించి, అన్ని మౌలిక వసతులతో కూడిన ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయని పక్షంలో, నిర్వాసితులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సీపీఎం పార్టీ ప్రభుత్వాన్ని, స్థానిక అధికారులను హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter