కాలుష్య కోరల్లో ఏటికొప్పాక కళాకారులు..

కాలుష్య కోరల్లో ఏటికొప్పాక కళాకారులు..

05/June/2026 11:18    Share:   

అవార్డులు తెచ్చిన ఆర్టిజన్స్ కాలనీకి చెత్త శాపం..!
వరాహ నది ఒడ్డున వ్యర్థాల దహనం – విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏటికొప్పాక ఆర్టిజన్స్ కాలనీ వాసులు
క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్ | అనకాపల్లి జిల్లా :
ఏటికొప్పాక గ్రామానికి చెందిన ఆర్టిజన్స్ కాలనీ ప్రస్తుతం తీవ్ర కాలుష్య సమస్యతో అల్లాడుతోంది. వరాహ నది ఒడ్డున గ్రామంలోని చెత్త, మురికి వ్యర్థాలను నిరంతరం పడేసి వాటికి నిప్పంటించడం వల్ల భారీగా విషవాయువులు వెలువడుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పొగ నేరుగా కాలనీలోకి చేరడంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు శ్వాసకోశ సమస్యలు, జ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏటికొప్పాక లక్క బొమ్మలను తయారు చేసే కళాకారులు నివసిస్తున్న ఈ కాలనీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ, స్థానికంగా కనీస జీవన హక్కులు కూడా కరువయ్యాయని వారు వాపోతున్నారు. చెత్తను వేయకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు పంచాయతీ సిబ్బంది, కార్యదర్శి, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపిస్తున్నారు.
వరాహ నది ఒడ్డును డంపింగ్ యార్డ్‌గా మార్చి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని, దీంతో నది పరిసర ప్రాంతాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి, జిల్లాకు పేరు తెచ్చిన కళాకారుల కాలనీ పరిస్థితి ఇలా ఉండటం దురదృష్టకరమని పేర్కొంటున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి చెత్త దహనాన్ని అరికట్టి, కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆర్టిజన్స్ కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. “అవార్డులు వచ్చినప్పుడు గుర్తొచ్చే మేము, సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు కనిపించం?” అని వారు ప్రశ్నిస్తున్నారు.
Breaking News

Subscribe our Newsletter