నిందితులను కఠినంగా శిక్షించాలని రూరల్ ఎస్సైకి వినతిపత్రం అందజేత
యలమంచిలి, ఏప్రిల్ 29:
(క్రైo అనాలసిస్ ప్రతినిధి కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ )
తిరుపతి జిల్లా వి.కోట మండలం ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి ఘాతుక హత్యను నిరసిస్తూ యలమంచిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక విలేకరులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం యలమంచిలి రూరల్ ఎస్ఐ ఉపేంద్రను కలిసి, ఈ హత్యకు కారకులైన నిందితులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రుద్ర సింహాచలం మాట్లాడుతూ.. సమాజంలో ఎప్పటికప్పుడు వార్తలను చేరవేస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే విలేకరులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా విధులు నిర్వహించే పాత్రికేయుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని, జగన్మోహన్ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.'
నిరసన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆడారి గంగాధర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీమాన్, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి సిహెచ్. సంతోష్, సీనియర్ పాత్రికేయులు పెద్దింటి సూర్యనారాయణమూర్తి, అల్లిమల్లి రాజు, గణేష్, రమణారావు, ఆర్.ఎస్. నాయుడు, ప్రసాద్, రాము, లోకేష్, ధీరజ్, కన్నేపల్లి శ్రీనివాస్, నూకరాజు మరియు ఇతర మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.