క్రైమ్ అనాల్సిస్ - టివియస్ ప్రకాష్
గుంటూరు: రాష్ట్రంలో విద్యారంగానికి వెన్నెముకలా నిలుస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 72 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు సివి రామన్ ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు.
అసోసియేషన్ కన్వీనర్ ఎం.సూర్యారావు అధ్యక్షతన జరిగిన సభలో కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రైవేటు ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, అధికారిక లెక్కల ప్రకారం సుమారు 1.20 లక్షల మంది ప్రైవేటు టీచర్లు సేవలందిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ, వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ పరిరక్షణ లేకపోవడం ఆందోళనకరమన్నారు.
ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు తగిన సౌకర్యాలు లేకుండా విద్యావ్యవస్థ ముందుకు సాగదన్నారు.
జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రైవేటు విద్యారంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, టీచర్ల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉందన్నారు. బలమైన సంఘటిత శక్తి ద్వారానే హక్కులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
అసోసియేషన్ కన్వీనర్ ఎం.సూర్యారావు మాట్లాడుతూ, విద్యార్థులకు వేసవి సెలవులు ఉన్నా ప్రైవేటు ఉపాధ్యాయులకు మాత్రం సెలవులు లేవని, ఏప్రిల్ వరకు *పనిచేయించుకుని* కూడా పూర్తి స్థాయి జీతాలు చెల్లించడం లేదని ఆరోపించారు. పలుచోట్ల 12 నెలల బదులు కేవలం 10 నెలల వేతనాలు మాత్రమే ఇస్తున్నారని, మిగతా నెలల్లో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు.
సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు మాట్లాడుతూ, ప్రైవేటు ఉపాధ్యాయులు సంఘటితంగా ముందుకు వచ్చి పోరాటాల ద్వారా తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం ఎంపికైన ఉపాధ్యాయులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు, జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముజఫర్ అహ్మద్, రాష్ట్ర నాయకులు కిరణ్, శ్రీనివాసరెడ్డి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.