క్రైమ్ అనాల్సిస్ - టివియస్ ప్రకాష్ : భీమవరం డీఎస్పీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో పోలీసుల ప్రవర్తనపై న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది.బాధిత బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయిస్తూ, కేసును వెనక్కు తీసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు, పోలీసుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.బాలికకు అండగా ఉండాల్సిన పోలీసులు, కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసం? అని న్యాయస్థానం ప్రశ్నించింది. “ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పడానికి సిగ్గుగా అనిపించడం లేదా?” అంటూ డీఎస్పీని గట్టిగా నిలదీసింది.“రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా నిర్ణయిస్తారు? మీకు దివ్యదృష్టి ఉందా?” అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కారణాలున్నాయా లేదా అనేది సంబంధిత కోర్టు తేలుస్తుందని స్పష్టం చేసింది.అలాగే, రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోలేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డీఎస్పీపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది.డీఎస్పీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొన్న న్యాయస్థానం, కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులతో జిల్లా ఎస్పీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.