అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లా కానుంది: సీఎం చంద్రబాబు నాయుడు
25/April/2026 07:43
Share:
శ్రీనివాస్ రావు . ఎ క్రైమ్ ఎనాలసిస్ , జిల్లా ఇంచార్జ్,అనకాపల్లి. రాంబిల్లిలో రూ.5,400 కోట్లతో రెన్యూ సోలార్ ప్లాంట్‌కు శంకుస్థాపన రెండేళ్లలో నిర్మాణం పూర్తి.. 2,100 మందికి ఉపాధి అవకాశాలు పెట్టుబడుల ఆకర్షణలో అనకాపల్లి జిల్లాదే అగ్రస్థానం రాంబిల్లి,... (అనకాపల్లి జిల్లా):రాష్ట్రంలోకి, ప్రత్యేకించి అనకాపల్లి జిల్లాకు భారీ పెట్టుబడులు క్యూ కడుతున్నాయని, త్వరలోనే ఈ జిల్లాను మరో రంగారెడ్డి జిల్లా స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో గురువారం రూ. 5,400 కోట్ల భారీ పెట్టుబడితో 'రెన్యూ ఎనర్జీ' సంస్థ ఏర్పాటు చేయనున్న 6.5 గిగావాట్ల సోలార్ ఇన్‌గాట్-వేఫర్ ఉత్పత్తి ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. పారిశ్రామికాభివృద్ధిలో అనకాపల్లి జిల్లా దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నేడు దేశంలోనే ధనిక జిల్లాగా ఎలా రూపాంతరం చెందిందో, అదే తరహాలో అనకాపల్లిని సైతం ఒక పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని సీఎం భరోసా ఇచ్చారు. రెండేళ్లలో ప్లాంట్ పూర్తి.. స్థానికులకు ఉపాధి రాంబిల్లిలో శంకుస్థాపన చేసుకున్న ఈ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం రెండేళ్లలో పూర్తి కానుందని, దీని ద్వారా ప్రత్యక్షంగా 2,100 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో మన దేశం విద్యుత్, ఇతర ఇంధన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి భారీ సోలార్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులను సైతం పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని ఆయన ప్రకటించారు.గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజల నడ్డి విరిచారని ముఖ్యమంత్రి విమర్శించారు. అయితే ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు. సోలార్, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచడం ద్వారా సామాన్యులపై భారం తగ్గించే దిశగా విద్యుత్ సంస్కరణల ఫలాలను ప్రజలందరికీ చేరువ చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెన్యూ ఎనర్జీ సంస్థ సీఈఓ మరియు ఛైర్మన్ సుమంత్ సిన్హా, ఇతర పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.