పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో మాస్ కాపీయింగ్ నివారణకు పటిష్ట నిఘా పెట్టాలని జేసీ డా. ఎం.జె. అభిషేక్ గౌడ ఆదేశం
25/April/2026 07:30
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు, ఏప్రిల్, 24 : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన నిఘా పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. పాలీసెట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ నుండి అధికారులతో జేసీ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఈనెల 25వ తేదీన జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షలకు 5278 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరవుతారన్నారు. ఏలూరులో 9 కేంద్రాలు, నూజివీడు లో 3, జంగారెడ్డిగూడెంలో 3 కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని, ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నపత్రాలు పటిష్టంగా భద్రపరచడం, పరీక్షల అనంతరం పరీక్షల కన్వీనర్ కార్యాలయం నకు పంపేవరకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్షల కేంద్రాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద మంచినీరు, వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య ననుసరించి ఆయా మండలాల నుండి పరీక్షా కేంద్రాల ప్రాంతాలకు అవసరమైన బస్సు సర్వీసులు ఏర్పాటుచేయాలని ఆర్డీఓ అధికారులను జేసీ ఆదేశించారు.ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, విద్య, రెవిన్యూ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.