అనకాపల్లిలో 'బ్లాక్ స్పాట్ల'పై పోలీస్, రవాణా శాఖ, అధికారుల ఉమ్మడి తనిఖీలు
24/April/2026 19:31
Share:
రోడ్డు ప్రమాదాలకు చెక్: అనకాపల్లిలో 'బ్లాక్ స్పాట్ల'పై అధికారుల ఉమ్మడి తనిఖీలు అనకాపల్లి : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో కీలక అడుగులు వేశాయి. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రమాదకర ప్రాంతాల్లో అధికారుల బృందం క్షేత్రస్థాయిలో ముమ్మర పరిశీలన చేపట్టింది.ఈ కార్యక్రమంలో అనకాపల్లి డీఎస్పీ శ్రీమతి ఎం.శ్రావణి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకట నారాయణ, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ లీలా ప్రసాద్, జాతీయ రహదారుల సంస్థ అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. ప్రమాదకర జంక్షన్లపై ప్రత్యేక ఫోకస్ ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నూకాలమ్మ తల్లి ఆలయ ఆర్చి జంక్షన్, శారదా నది బ్రిడ్జి పరిసరాలు మరియు కొత్తూరు జంక్షన్లను అధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. గతంలో జరిగిన ప్రమాదాలను విశ్లేషించిన అధికారులు.. ఆయా ప్రాంతాల్లో ఉన్న లోపాలను గుర్తించారు. ఈ సందర్భంగా జంక్షన్ల వద్ద సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం, రంబుల్ స్ట్రిప్స్, స్పష్టమైన హెచ్చరిక బోర్డుల ఏర్పాటు తదితర అంశాలపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు డీఎస్పీ పలు సూచనలు జారీ చేశారు. వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు పాదచారుల భద్రత కోసం తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై కార్యాచరణను సిద్ధం చేశారు. హైవేపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రమాదాల నివారణకు పోలీసులకు సహకరించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్ రావు . ఎ క్రైమ్ ఎనాలసిస్ , జిల్లా ఇంచార్జ్,అనకాపల్లి.