అనకాపల్లి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది! నక్కపల్లి జంక్షన్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి పంట కాలువలోకి బోల్తా కొట్టింది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న శ్యామొలి ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. సరిగ్గా తెల్లవారుజామున 3:30 నిమిషాల ప్రాంతంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారడంతోనే ఈ ఘోరం జరిగినట్లు ప్రయాణికులు వణికిపోతూ చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు.. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బయటపడ్డారు.ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ఉండగా.. 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి కాస్త విషమంగా ఉండటంతో హుటాహుటిన 108 అంబులెన్స్‌లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ తో బస్సును బయటకు తీసి, జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. తృటిలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు." శ్రీనివాస్ రావు . ఎ క్రైమ్ ఎనాలసిస్ , జిల్లా ఇంచార్జ్,అనకాపల్లి.