కేజీబీవీ పాఠశాలలో "అభయ" మహిళల భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహణ
15/July/2026 19:18
Share:
రాంభిల్లి, అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రత మరియు సాధికారత లక్ష్యంగా చేపట్టిన "అభయ" ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, నేడు రాంభిల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV), రాంభిల్లిలో అవగాహన కార్యక్రమాన్ని రాంభిల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ గారు విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. విద్యార్థినులు తమపై ఎలాంటి వేధింపులు, సైబర్ నేరాలు, ర్యాగింగ్, స్టాకింగ్ లేదా ఇతర సమస్యలు ఎదురైనా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.అలాగే సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, ఓటీపీలు లేదా బ్యాంకు సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద ఘటనలు జరిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థినులకు అభయ కార్యక్రమం యొక్క ఐదు ముఖ్య లక్ష్యాలు అయిన నివారణ (Prevent), రక్షణ (Protect), అండ (Support), న్యాయం (Ensure Justice), సాధికారత (Empowerment) గురించి వివరించారు. ప్రతి విద్యార్థిని ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ముందుకు సాగాలని, ఏ సమస్య వచ్చినా మౌనంగా ఉండకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.విద్యార్థినులకు అత్యవసర సేవల హెల్ప్‌లైన్ నంబర్లు 112 (ఎమర్జెన్సీ), 181 (మహిళల హెల్ప్‌లైన్), 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్), 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) మరియు అనకాపల్లి జిల్లా పోలీస్ వాట్సాప్ హెల్ప్‌లైన్ – 7993485111 గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు."భద్రంగా ఉండండి... ధైర్యంగా ఉండండి... మేము మీతోనే ఉన్నాం" అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.