
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల థీమ్తో నీటి వనరుల పరిరక్షణకు చర్యలు
అనకాపల్లి, ఏప్రిల్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’లో భాగంగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ నెల థీమ్ ‘జలధారా-జలహారతి’ 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ను విజయవంతంగా ప్రారంభించారు. నీటి వనరుల సంరక్షణ, శుభ్రత, పునరుద్ధరణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీల్లో చెరువులు, కుంటలు, కాలువలను శుభ్రపరచడం, మురుగునీటిని తొలగించడం, వర్షపునీటి సంగ్రహణకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ డ్రైవ్లో ప్రజలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది చురుగ్గా పాల్గొన్నారు. నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.
ఎలమంచిలి నియోజకవర్గంలో అధికారుల భాగస్వామ్యం
ఎలమంచిలి నియోజకవర్గం, రాంబిల్లి మండలంలోని కిష్టపాలెం గ్రామ ఊరచెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్, పీడీ డ్వామా, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి, డీడీఓ, డీఈ ఇరిగేషన్ (ఎలమంచిలి), జిల్లా రవాణా అధికారి, ఎంఆర్వో, ఎంపీడీవో, మండల, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిలో వర్షపునీటి సేకరణను ప్రోత్సహిస్తూ, నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరగనున్నాయి
ఈ 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ ద్వారా జిల్లాలో పలు నీటి వనరులు పునరుద్ధరించబడి, పరిశుభ్రత, నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భజలాల స్థాయి పెంచడంలో ఈ కార్యక్రమం కీలకపాత్ర పోషించనుంది.భవిష్యత్తులో ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తూ, పరిశుభ్రత, నీటి సంరక్షణలో అనకాపల్లి జిల్లా ముందంజలో నిలిచేలా కృషి చేస్తామని అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.