
న్యూఢిల్లీ : ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ రవి గుప్తా భారతీయ ఆహార పదార్థాల్లోని ప్రమాదకర రసాయనాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల్లో నిషేధించబడిన అనేక హానికర పదార్థాలు భారతదేశంలో విచ్చలవిడిగా వాడుతున్నారని, వీటి వలన గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.డాక్టర్ గుప్తా మాట్లాడుతూ.. "డాల్డా (పాక్షికంగా హైడ్రోజనేటెడ్ నూనెలు), సింథటిక్ రంగులు, అజినోమోటో (MSG), చిప్స్‌లో ఉపయోగించే BHA (బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్) వంటి పదార్థాలు అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో నిషేధించబడ్డాయి. కానీ భారతదేశంలో మాత్రం వీటి వినియోగం పూర్తిగా నియంత్రణ లేకుండా సాగుతోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రసాయనాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వలన గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, కాలేయ సమస్యలు, నాడీ వ్యవస్థపై దుష్ప్రభావాలు తలెత్తుతాయని ఆయన వివరించారు. ప్రజలు సాధ్యమైనంత వరకు సహజ ఆహారాన్ని ఎంచుకోవాలని, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.అలాగే, ఆహార భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయాలని, విదేశాల్లో నిషేధించబడిన రసాయనాలను భారతదేశంలో కూడా నిషేధించాలని డాక్టర్ రవి గుప్తా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.