
కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులతో ఇప్పటికే ఇద్దరు బలి – పట్టించుకోని పొల్యూషన్ బోర్డుపై గ్రామస్తుల ఆగ్రహం
అనకాపల్లి: అభివృద్ధి పేరుతో వెలసిన ఓ బొగ్గు ఫ్యాక్టరీ ఇప్పుడు 25 గ్రామాల ప్రజల పాలిట మృత్యుపాశంగా మారింది. అనకాపల్లి మండలం పిసినీకాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో ఉన్న ఈ కర్మాగారం నుంచి వెలువడుతున్న దట్టమైన నల్లటి ధూళితో స్థానికులు స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేని దుస్థితి నెలకొంది. అనహిత రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాలక్ష్మి వెల్నెస్ ఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఫ్యాక్టరీ కాలుష్యంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ ప్రాంతంలోని 25 గ్రామాలకు ప్రాణాధారమైన ‘సృజల స్రవంతి’ వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంట్ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల పూర్తిగా కలుషితమైంది. గాలిలో ఎగురుకొస్తున్న బొగ్గు వ్యర్థాలు, పొడి నేరుగా తాగునీటిలో కలుస్తున్నాయి. ఆరు నెలలకోసారి మార్చాల్సిన ప్లాంట్ ఫిల్టర్లు ఈ మురికి దెబ్బకు నెల రోజులకే పాడైపోతున్నాయి. అనకాపల్లి, కశింకోట మండలాలకు కుళాయిల్లో రంగు మారిన, నురగతో కూడిన నీరు వస్తుండటంతో దాహమేస్తే ఏం తాగాలో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
కలుషిత గాలి, విషపూరిత నీరు సేవించడం వల్ల కాలనీవాసులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారు. ఇన్నాళ్లు సాధారణ జ్వరాలే అనుకున్న గ్రామస్తులు ఇటీవల మరణాల సంఖ్య పెరగడంతో వైద్య పరీక్షలు చేయించుకుని ఉలిక్కిపడ్డారు. అత్యధికులు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. ఇటీవల కిడ్నీ వ్యాధులతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం గ్రామాల్లో తీవ్ర భీతిని సృష్టించింది.
నిబంధనలను గాలికొదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. కనీసం ఏటా జరగాల్సిన తనిఖీలు కూడా శూన్యం. పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందన లేదు. దీంతో సహనం కోల్పోయిన స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. తక్షణమే ఈ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేసి, కాలనీ పరిధి నుంచి తరలించకపోతే ఉమ్మడిగా ఉద్యమిస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
శ్రీనివాస్ రావు . ఎ క్రైమ్ ఎనాలసిస్, జిల్లా ఇంచార్జ్, అనకాపల్లి