దిమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ – రూ. 5 లక్షల ఆస్తి నష్టం
14/April/2026 15:22
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి : యలమంచిలి మండలంలోని దిమిలి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుమారు సాయంత్రం 5 గంటల 15 నిమిషాల సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న ముఖ్యమైన వైద్య పరికరాలు, ఏసీ యూనిట్లు, అలాగే విద్యుత్ వైరింగ్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సిబ్బంది మరియు స్థానికులు అప్రమత్తంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో మంటలు ఇతర గదులకు వ్యాపించకుండా నివారించగలిగారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. సమయానికి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.