రూ. 15 కోట్లతో వాక రోడ్డు ఆధునీకరణ.. రైల్వే ట్రాక్ అలైన్‌మెంట్‌తో తలెత్తిన సాంకేతిక చిక్కు!
14/April/2026 08:34
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి : రామన్నపాలెం నుంచి యలమంచిలి (పెదపల్లి) వరకు ఉన్న స్థానికంగా ‘వాక రోడ్డు’గా ప్రసిద్ధి చెందిన మార్గం అభివృద్ధి పనుల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. నర్సీపట్నం, మాకవరపాలెం, రోలుగుంట ప్రాంతాలకు ఈ రహదారి జాతీయ రహదారికి చేరుకునే ప్రధాన మార్గంగా ఉండటంతో దీని అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది.సుమారు 15 కిలోమీటర్ల పొడవున రామన్నపాలెం సెంటర్ నుంచి ఎరకన్నపాలెం మీదుగా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పెదపల్లి వరకు ఈ రహదారిని విస్తరించేందుకు రూ.15 కోట్లు మంజూరు చేశారు. మొదట 40 అడుగుల వెడల్పుతో ప్రతిపాదించిన రహదారిని ఇప్పుడు 100 అడుగుల వెడల్పుతో జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా రూపకల్పన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, APIIC అధికారులు సంయుక్తంగా సర్వేలు నిర్వహిస్తున్నారు.అయితే, పనులు ప్రారంభ దశలోనే ఒక సాంకేతిక సమస్య తలెత్తింది. రామన్నపాలెం సమీపంలోని పయనీర్ కంపెనీకి రవాణా సౌకర్యం కల్పించేందుకు బయ్యవరం రైల్వే స్టేషన్ నుంచి సంస్థ వరకు కొత్తగా నిర్మిస్తున్న రైల్వే ట్రాక్ అలైన్‌మెంట్ ఈ రహదారి మార్గంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర పొరపడుతోంది.ఈ నేపథ్యంలో రహదారి వెడల్పును ఒక వైపు తగ్గించాలా, ప్రైవేటు భూముల వైపు విస్తరించాలా, లేక రైల్వే ట్రాక్ మార్గాన్ని మార్చాలా అనే అంశాలపై అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వేల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.ఈ సమస్య పరిష్కారమైన వెంటనే రహదారి నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే మాకవరపాలెం–యలమంచిలి మధ్య దూరం సుమారు 13 కిలోమీటర్ల మేర తగ్గడంతో పాటు, పారిశ్రామిక రవాణా కూడా గణనీయంగా మెరుగుపడనుంది.