మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం..ఎమ్మెల్యే బడేటి చంటి

మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం..ఎమ్మెల్యే బడేటి చంటి

21/March/2026 06:33    Share:   

జాబు క్యాలెండర్ విడుదలపై ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్య 
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు 
ఏలూరు, మార్చి 20..
రాష్ట్రంలోని యువతకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ఉగాది రోజున జాబ్  క్యాలెండర్ విడుదల చేసి కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని జిల్లా టిడిపి అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. నిరుద్యోగులకు  20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఏలూరు పవర్ పేట లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యువగళంలో ఇచ్చిన హామీని మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారని, కొత్త సంవత్సరం రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించిందని చెప్పారు. అంతేకాకుండా దీనివల్ల యువత భవిష్యత్తుకు భరోసా లభిస్తుందన్నారు. ఒకేసారి వివిధ శాఖల పరిధిలో పదివేల 60 పోస్టుల భర్తీకి ప్రభుత్వం స్వీకారం చుట్టిందని ఆయన చెప్పారు. ఇప్పటికే 20 నెలల్లో ఆరు లక్షల 28  వేల 347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగిందన్నారు.   స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం,  డీఎస్సీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తదితర వాటి ద్వారా  ఈ ఉద్యోగాల కల్పన జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 
యువతకు భవిష్యత్తులో కూడా మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో విశాఖపట్నం, నెల్లూరు వంటి ప్రాంతాల్లో అనేక కంపెనీలను తీసుకువస్తూ, భవిష్యత్తులో మరో 25 లక్షల ఉద్యోగాలు సృష్టించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే చంటి తీవ్ర విమర్శలు చేశారు. పెట్టుబడులు పెట్టే వారిని బెదిరిస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. 
క్రమశిక్షణతో పని చేస్తున్న వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అనవసర ఆరోపణలు చేయడం సరైంది కాదని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. వైసీపీ విధ్వంస పాలనలో నిరుద్యోగులను జగన్మోహన్ రెడ్డి నిలువునా మోసం చేశారని ఆయన మండిపడ్డారు. యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి,డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాసరావు, ఏలూరు నగర టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు చోడే వెంకటరత్నం,రెడ్డి నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter