యమపాశంగా మారిన బొగ్గు ప్లాంట్: అనకాపల్లి గ్రామస్తుల ఆందోళన.

యమపాశంగా మారిన బొగ్గు ప్లాంట్: అనకాపల్లి గ్రామస్తుల ఆందోళన.

14/April/2026 06:31    Share:   

బొగ్గు ప్లాంట్‌ కాలుష్యం.. గాలిలో ప్రాణాలు!అనకాపల్లి బీఆర్టీ కాలనీలో రగులుకున్న ఆగ్రహజ్వాలలు
శ్రీనివాస్ రావు . ఎ క్రైమ్ ఎనాలసిస్ , జిల్లా ఇంచార్జ్,అనకాపల్లి.
అనకాపల్లి ప్రతినిధి, (వార్తా కథనాలు): అభివృద్ధి పేరుతో వెలుస్తున్న పరిశ్రమలు సామాన్యుల పాలిట శాపంగా మారుతున్నాయి. పీల్చే గాలిలో విషం నిండి ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ పరిధిలోని బీఆర్టీ (BRT) కాలనీలో నిర్వహిస్తున్న ఓ బొగ్గు ప్లాంట్ కాలుష్యం ఇప్పుడు స్థానికుల పాలిట యమపాశంగా మారింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ప్లాంట్‌ను వెంటనే తొలగించాలని కోరుతూ సోమవారం గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున ప్లాంట్ ఎదుట ధర్నాకు దిగారు.
నల్లటి ధూళితో కప్పుకుపోతున్న కాలనీ.బీఆర్టీ కాలనీలో అనహిత రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాలక్ష్మి వెల్మెన్ ఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా బొగ్గు ప్లాంట్‌ను నిర్వహిస్తున్నాయి. అయితే, ఈ ప్లాంట్ నుంచి వెలువడుతున్న విపరీతమైన కాలుష్యం కారణంగా కాలనీ మొత్తం నల్లటి ధూళితో కప్పుకుపోతోంది. కనీసం బయట కూర్చోవాలన్నా, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలన్నా జనం భయపడుతున్నారు. బొగ్గు ధూళి కారణంగా గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇదే కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కిడ్నీ సమస్యలతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా కదలని యంత్రాంగం..కాలుష్యంతో తాము పడుతున్న ఇబ్బందులపై గ్రామస్తులు పీజీఆర్‌ఎస్‌ (PGRS) ద్వారా జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు నెలకు ఒక్కసారి కూడా ఇటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతూ రోడ్డెక్కిన గ్రామస్తులతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
అధికారుల హామీతో.. తాత్కాలిక విరమణ..
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో కాలుష్య నివారణ అధికారులు, మానిటరింగ్ కమిటీ ప్రతినిధులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. మూడు రోజుల్లో ప్లాంట్ కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని అధికారుల నుంచి స్పష్టమైన హామీ రావడంతో గ్రామస్తులు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి వైసీపీ అనకాపల్లి ఇన్‌చార్జ్ మాలసాల భరత్ కుమార్ సంఘీభావం ప్రకటించారు. ఈ ధర్నాలో కాలనీ మహిళలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజుల్లో అధికారులు స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.
Breaking News

Subscribe our Newsletter