కోటవురట్ల వద్ద పశువుల అక్రమ రవాణా భగ్నం: 11 పశువుల పట్టివేత, ఇద్దరి అరెస్టు
13/April/2026 07:23
Share:
కోటవురట్ల మండల పరిధిలోని చౌడువాడ జంక్షన్ వద్ద పశువుల అక్రమ రవాణాను పోలీసులు శనివారం (ఏప్రిల్ 11న) భగ్నం చేశారు. పక్కా సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు, అక్రమంగా తరలిస్తున్న 11 పశువులను రక్షించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఏప్రిల్ 11వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చౌడువాడ జంక్షన్ మీదుగా పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కోటవురట్ల పోలీసులకు రహస్య సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన కోటవురట్ల ఎస్ఐ రమేష్, తన సిబ్బందితో కలిసి జంక్షన్ వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఏపీ 39 డబ్ల్యూఈ 6517 (AP 39 WE 6517) నంబరు గల బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. అందులో అత్యంత ఇరుకుగా, హింసాత్మక రీతిలో కుక్కి ఉన్న 11 పశువులను గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా వీటిని రవాణా చేస్తున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు, వెంటనే వాహన డ్రైవర్ బర్రె రాజేష్ కుమార్, క్లీనర్ గంటేటి మాలియ్యాను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు బొలెరో వాహనాన్ని సీజ్ చేసి, నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రక్షించిన 11 పశువులను సురక్షితంగా స్థానిక గోసంరక్షణ కేంద్రానికి (గోశాలకు) తరలించినట్లు ఎస్ఐ రమేష్ వెల్లడించారు. మూగజీవాలను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. . ఎ శ్రీనివాస్ రావు క్రైమ్ ఎనాలసిస్, జిల్లా ఇంచార్జ్,అనకాపల్లి.