విశాఖపట్నం, ఏప్రిల్
రాష్ట్రంలో పోక్సో (POCSO) కేసుల్లో నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత
స్పష్టం చేశారు. నేరస్థులపై కఠిన వైఖరిని అవలంబించడంతో పాటు, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే తమ ప్రథమ లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు.శనివారం విశాఖపట్నంలో నిర్వహించిన "మానవ అక్రమ రవాణా & బానిస కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టం, 1976" పై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పోక్సో కేసులపై కఠిన నిఘా: నిందితులకు సులభంగా బెయిల్ లభించకుండా ప్రాసిక్యూషన్ అధికారులు పకడ్బందీగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. ఒంగోలులో ఒక పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల శిక్ష పడటం పకడ్బందీ దర్యాప్తునకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.ఆపరేషన్ ట్రేస్ (Operation Trace): పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు సుమారు 900 మంది పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు వెల్లడించారు. అలాగే విదేశాల్లో చిక్కుకున్న 180 మందిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చామని తెలిపారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర: న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరగడంలో ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకమని, చార్జ్ షీట్ దాఖలు చేసే స్థాయి నుండి వారు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు.ఆధునిక సాంకేతికత: నేరాల దర్యాప్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని, తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయని ఆమె తెలిపారు.బాధితులకు భరోసా: బానిస కార్మికులుగా గుర్తించబడిన వారికి కేంద్రం రూ. 30,000 ఆర్థిక సాయం అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం వారి పునరావాసం కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది ప్రాసిక్యూషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్భుత ప్రతిభ కనబరిచిన అధికారులను మంత్రి సత్కరించారు.
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ :