ఏలూరు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్

ఏలూరు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్

01/April/2026 07:39    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఏలూరు ఇంచార్జి 
ఏలూరు, మార్చి , 31 : జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం జరిగిన మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కె. కిషోర్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మాదకద్రవ్య రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను రూపొందించేందుకు సమాజంలోని ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు.  గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు జోలికి వెళితే భవిష్యత్తు అంధకారమవుతుందని యువతలో అవగాహన కలిగించి,   యువత మాదకద్రవ్యాల జోలికి పోకుండా చూడాలన్నారు. మాదకద్రవ్యాలతో పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవనన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు కలిగివున్నా , వినియోగం, రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి  కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు.  ఉద్యోగాలకు, పాస్పోర్ట్ ల జారీ కి అనర్హతతో పాటు శాశ్వత క్రిమినల్ రికార్డు కలిగి ఉంటారని, భవిష్యత్తు మొత్తం అంధకారం అవుతుందన్నారు.  మాదకద్రవ్యాల వినియోగంపై దుష్ప్రభావాలు, దుష్పరిణామాలపై ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కలిగించేందుకు  ప్రతీ పాఠశాల, కాలేజీలలోనూ పోస్టర్ల ద్వారా తెలియజేయడంతోపాటు సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కలిగించాలని అధికారులను ఆదేశించారు.జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ  పాఠశాలలు, కళాశాలల్లో ఎవరైనా మాదకద్రవ్యాలు సేవిస్తున్నా, పెడ్లర్స్ సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి  సమాచారం అందించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారికి డి అడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స అందించడం జరుగుతుందన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయించకుండా ఔషధ దుకాణాలను తనిఖీ చేయాలన్నారు.   ట్రైన్లు, రవాణా వాహనాల ద్వారా గంజాయి, డ్రగ్స్ రవాణాని నియంత్రించేందుకు వజ్రప్రహార్ ద్వారా నిఘా  చర్యలు తీసుకుని, మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
ఈ సమావేశంలో జిల్లా ఏఎస్పీ నక్కా సూర్యచంద్ర రావు, ఉప రవాణా కమీషనర్ కరీమ్,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శోభా, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమమ్మ,   ఎక్సయిజ్ శాఖ సూపరింటెండెంటు ఏ.ఆవులయ్య , విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్, సాంఘిక సంక్షేమాధికారి విశ్వమోహన్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ రమేష్, ఐసిసిఎస్ పీడీ శారద, బాలల సంరక్షణాధికారి సూర్యచక్రవేణి,  ఈగిల్ టీమ్ ఇంచార్చి బి. ఉదయభాస్కర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter