ఏలూరు, మార్చి 24, 2026: ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు పోలీసులకు సంబంధించిన వందలాది మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంపై ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అసోసియేషన్ నాయకులతో కలిసి ఏలూరు సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎం. సమాధాన రాజును కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అనారోగ్య కారణాలతో వైద్యం చేయించుకున్న ఉద్యోగ వర్గాలకు రావాల్సిన మెడికల్ బిల్లులు సూపరింటెండెంట్ కార్యాలయం పరిధిలో వందల సంఖ్యలో నిలిచిపోయాయని పేర్కొన్నారు. రూ. 50,000 లోపు ఉన్న బిల్లులను సూపరింటెండెంట్ స్థాయిలోనే పరిష్కరించి సంబంధిత అధికారులకు పంపే వెసులుబాటు ఉందని, తద్వారా అవి త్వరగా ట్రెజరీకి చేరుతాయని ఆయన సూచించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ నిధులు సకాలంలో అందేలా చూడాలని కోరారు.దీనిపై సూపరింటెండెంట్ డాక్టర్ సమాధాన రాజు సానుకూలంగా స్పందిస్తూ.. కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న అన్ని మెడికల్ బిల్లులను త్వరలోనే క్షుణ్ణంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు, ఏలూరు తాలుకా కార్యదర్శి గంటా చంద్రశేఖర్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు ఆర్. నాగేశ్వరరావు, నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు దంపనబోయిన అనూష, ఎస్తేరు రాణి, పద్మావతి మరియు ఇతర ఎన్జీవో సంఘ నాయకులు పాల్గొన్నారు.
కొండల ప్రసాద్,
CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.