జూలై 7 చలో విజయవాడ కార్యక్రమం ఏపి.మున్సిపల్ వర్కర్స్ యూనియన్...
28/June/2026 20:14
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు: అపరిష్కృతంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 7న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) డిమాండ్ చేసింది.చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం నందు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో కార్మికులకు పని భద్రత లేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మినెంట్ కార్మికుల బకాయిలు పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా విధానాలు ఉన్నాయని విమర్శించారు. తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్వచ్ఛ పర్యవేక్షణ పేరుతో ప్రైవేటు వాహనాలు, మంత్రాలతో పాటు ప్రైవేటు కార్మికులను నియమించే కుట్ర పన్నుతుందని విమర్శించారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న పోరాటాలకు సిపిఐ పూర్తి మద్దతు తెలుపుతుందని తెలిపారు.ఏపి.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్ మాట్లాడుతూ పెరిగిన జనాభా కారణంగా మున్సిపల్ కార్మికులపై పని భారంపెరిగిపోయి అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కారుణ్య నియమాకాలు కూటమి ప్రభుత్వంలో అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. పట్టణాలకు వలసలు పెరిగిన కారణంగా వ్యర్ధాలు అధికమై కార్మికులపై ఒత్తిడి అధికంగా ఉందన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా కార్మికులను మాత్రం నియమించడం లేదని విమర్శించారు. జులై 7న జరిగే చలో విజయవాడ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఏఐటీయూసీ గౌరవాధ్యక్షులు కే కృష్ణమాచార్యులు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగడం లేదని విమర్శించారు. కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని, జూలై 7 చలో విజయవాడ కార్యక్రమం వేలాది మంది మున్సిపల్ కార్మికులతో నిర్వహించి ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఉప్పులూరి హేమ శంకర్,ఏఐటియుసి ఏలూరు ఏరియా కార్యదర్శి, ఏ అప్పలరాజు.సిపిఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి , కురెళ్ల వరప్రసాద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు నగర సమితి సభ్యులు అంతరాజు కిరణ్,పైడారి వంశీ, ఏ ప్రసాద్, గూడుపు దుర్గారావు, బంగారు గురు ప్రసాద్, పంతం వెంకటేశ్వరరావు,లోమి, బంగారు లోకేష్, మాడుగుల జగదీష్, అంతరాజు లీల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు