భగత్ సింగ్ ఆశయ సాధన కోసం యువత నడుం బిగించాలి: సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము పిలుపు
23/March/2026 12:55
Share:
అచ్యుతాపురం, మార్చి 23: భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని అచ్యుతాపురం మండలంలోని కొత్త మోసయ్యపేటలో గల భగత్ సింగ్ విగ్రహానికి జేవీవీ (JVV) నాయకులు బొడ్డేడ రామ్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం అచ్యుతాపురం బాయ్స్ హాస్టల్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము, మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు, ఐద్వా మండల కన్వీనర్ ఆర్. లక్ష్మి మాట్లాడుతూ.. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర పోరాటంలో అతి చిన్న వయసులోనే భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని కొనియాడారు. దేశం కోసం వారు చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. నేటి పరిస్థితులపై ఆవేదన: పరాయి పాలన నుండి దేశానికి స్వాతంత్రం సాధించుకున్నప్పటికీ, నేటి పాలకులు యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నారని వారు విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా లభిస్తున్నాయని, వీటిని అదుపు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు పిలుపు: భగత్ సింగ్ స్ఫూర్తితో యువత విద్యా, ఉపాధి హక్కుల కోసం పోరాడాలని, సమ సమాజ స్థాపనకై కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీ మరిడిమాంబ యూత్ సభ్యులు శెట్టి చిన్నబాబు, కిల్లాడి చిన్న, పంచదారల వెంకన్న, ఎస్. రమణ, పి. సత్యనారాయణ, ఉరిమి రామకృష్ణ, శివ, రామచంద్ర, స్వరూప్ మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.