పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ క్లబ్ సేవలు ప్రశంసనీయం.డిఎఫ్ఓ ఎన్ సోమసుందర్.
22/March/2026 17:45
Share:
పకృతి ప్రేమకు నిదర్శనం – దేవాలయాల్లో పక్షులకు ఆహారం, నీరు, ఆశ్రయం ఏర్పాటు దేవాలయాలు ప్రకృతి సేవా వేదికలు.పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ క్లబ్ సేవలు ప్రశంసనీయం. డిఎఫ్ఓ ఎన్ సోమసుందర్. పకృతి సంరక్షణలో భాగంగా గ్రీన్ క్లబ్ అనకాపల్లి వారి ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలోని పలు దేవాలయ ప్రాంగణాల్లో పక్షుల కోసం ధాన్యపు కుంచులు, త్రాగునీటి పాత్రలు మరియు గూళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీ ఎన్. సోమసుందర్ గారు మాట్లాడుతూ, “ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి మనిషి బాధ్యత. ప్రకృతి ఉంటేనే మనిషి జీవనం కొనసాగుతుంది. గ్రీన్ క్లబ్ వారు గత 12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పక్షుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుండడం ఎంతో ప్రశంసనీయం. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా, ప్రకృతి సేవకు వేదికగా మారడం అభినందనీయం” అని పేర్కొన్నారు. కర్షక దేవోభవ జాతీయ అధ్యక్షులు శ్రీ ఆడారి కిషోర్ కుమార్ గారు మాట్లాడుతూ, “ప్రకృతిని ప్రేమిస్తూ భవిష్యత్తును కాపాడుకుందాం అనే భావనతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో గ్రీన్ క్లబ్ చేస్తున్న కృషి మరవలేనిది. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథిదేవోభవ, ప్రకృతిదేవోభవ’ అనే సూక్తికి అనుగుణంగా వారు సేవలందిస్తున్నారు” అని తెలిపారు. ప్రముఖ సంఘ సేవకులు, శ్రీ గౌరీ సేవా సంఘం అధ్యక్షులు శ్రీ కర్రి సన్యాసి నాయుడు గారు మాట్లాడుతూ" ప్రజల నిర్లక్ష్యం కారణంగా పర్యావరణం, నీటి వనరులు కలుషితం కాకూడదని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ స్పృహ కలిగి ఉండాలని, 12 సంవత్సరాలగా ప్రతి నెల పెద్ద సంఖ్యలో పర్యావరణ పరిరక్షణ జాగృతి కార్యక్రమాల్లో గ్రీన్ క్లబ్ కార్యకర్తలు పాల్గొంటూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నారు అని, వారి కృషి అభినందనీయమని, ఎంతసేపు ఉన్న వనరుల్ని వాడుకోవడమే కాదు పర్యావరణానికి తిరిగి ఇవ్వడము తెలియజేస్తున్న గ్రీన్ క్లబ్ ను ప్రశంసించారు. అనంతరం గ్రీన్ క్లబ్ సభ్యులు గాంధీనగర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, భోగలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ గౌరీ సేవా సంఘం దేవాలయం, సుంకరమెట్టలోని సూర్యనారాయణ స్వామి దేవస్థానం, సంతోషిమాత దేవస్థానం మరియు ఇతర దేవాలయాల్లో పక్షుల కోసం ధాన్యపు కుంచులు, త్రాగునీటి పాత్రలు మరియు గూళ్లు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకులు శ్రీ కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ గారు, బోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ కాండ్రేగుల సత్యనారాయణ గారు, విశ్రాంత అటవీ శాఖ రేంజర్ శ్రీ బీర వినోద్ కుమార్ గారు, శ్రీ నైశెట్టి సత్తిబాబు గారు, శ్రీ బేతాళం శేషసాయి గారు, డాక్టర్ కొణతాల రాజేష్ గారు, శ్రీమతి రావూరి అనిత గారు, శ్రీమతి కర్రీ నీలవేణి గారు, శ్రీమతి దూదిపల్లి స్వాతి గారు, పెంటకోట ఉమా మహేశ్వర రావు గారు మరి అధిక సంఖ్యలో గ్రీన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. గ్రీన్ క్లబ్ చేస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ప్రజలు అభినందించడం విశేషం.