
అనకాపల్లి,
(ప్రతినిధి శ్రీనివాస్.ఏ "క్రైమ్ ఎనాలిసిస్, జిల్లా ఇన్చార్జ్.అనకాపల్లి.)
స్థానిక ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, మౌలిక వసతులు, నిర్వహణ తీరుపై ఆయన స్వయంగా ఆరా తీశారు.ఎమ్మెల్యే ఆసుపత్రిలోని వివిధ వార్డులలో కలియదిరిగి, నేరుగా రోగుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు.వారికి అందుతున్న వైద్య సేవల వివరాలు,ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఆపరేషన్ థియేటర్లతో సహా ఆసుపత్రి ప్రాంగణంలోని పరిశుభ్రతను నిశితంగా పరిశీలించారు. నిర్వహణలో లోపాలపై సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. రోగులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా తనిఖీ చేసి, ఆహార నాణ్యతా ప్రమాణాల గురించి ఆరా తీశారు.
ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఎల్లప్పుడూ మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. "ఆసుపత్రిలో మందుల కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తకూడదు. పరిశుభ్రత పాటించడంలో ఏమాత్రం రాజీపడవద్దు. పేదల ఆరోగ్య భద్రత విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా ఉపేక్షించేది లేదు" అని సంబంధిత కాంట్రాక్టర్లను ఆయన గట్టిగా హెచ్చరించారు.