జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం భూకంపం సంభవించింది.
02/February/2026 09:53
Share:
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) అందించిన వివరాల ప్రకారం.. ఉదయం 5:35 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. నిద్రలో ఉన్న జనం ఉలిక్కిపడి ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారుఈ భూకంప కేంద్రం బారాముల్లా జిల్లాలోని పటాన్ ప్రాంతంలో ఉన్నట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది. దీని ప్రభావం కేవలం బారాముల్లాకే పరిమితం కాకుండా, గుల్మార్గ్, శ్రీనగర్ పశ్చిమ ప్రాంతాల్లో కూడా స్పష్టంగా కనిపించింది. పహల్గామ్ నుండి పశ్చిమంగా 84 కిలోమీటర్లు, కార్గిల్ నుండి నైరుతి దిశలో 164 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ తీవ్రత భారత సరిహద్దులను దాటి పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో కూడా కనిపించింది.భూకంప తీవ్రతకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోయలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల్లో భూమి ఏ స్థాయిలో కంపించిందో స్పష్టంగా రికార్డయ్యింది. ముఖ్యంగా తెల్లవారుజామున నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా భవనాలు, వీధి దీపాలు ఊగిపోవడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది. నెటిజన్లు ఈ దృశ్యాలను షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.