ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ కమిటీ సమావేశం ఆటోనగర్ అసోసియేషన్ కార్యాలయం అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగినది.ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు అరుణతార నాగేశ్వరరావు అడపా సత్యనారాయణ మాట్లాడుతూ ఆటోనగర్ ఏర్పడి పుష్కరకాలం దాటినా అభివృద్ధి మాత్రం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఆటోనగర్ భూములపై విధించిన రిజంప్షన్ గౌరవ హైకోర్టు తొలగిస్తూ తీర్పు ఇచ్చి నెల రోజులు దాటినా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. 2014వ సంవత్సరంలో ఆటోనగర్ లో యూనిట్లు ఏర్పాటు చేయడం కోసం ఆటోనగర్ స్థల కేటాయింపు పత్రాలను బ్యాంకుల్లో గ్యారంటీగా పెట్టి అప్పులు తెచ్చి అనేక ఇబ్బందులు పడి యూనిట్లు ఏర్పాటు చేసిన ఆటోనగర్ సభ్యులు అప్పు తీరినప్పటికీ ఏళ్ల తరబడి స్థల పత్రాలు చేతికి అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్రి ఈశ్వరరావు సహాయ కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ గౌరవ హైకోర్టు తీర్పును సైతం అధికారులు అమలు చేయకుండా కాలయాపన చేయడం ఆటోనగర్ అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా ఉందని ఆరోపించారు. తక్షణమే అధికారులు స్పందించి గౌరవ హైకోర్టు తీర్పును అమలు చేయుటకు తగిన చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ఆటోనగర్ కార్మికులు తమ హక్కుల కోసం ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని తెలిపారు. గత నెలలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన ఉప్పులూరి హేమ శంకర్,బొడ్డు సురేష్, మంతెన వెంకటేశ్వరరావు, నడిపల్లి శ్రీనివాసరావు ఈ సమావేశంలో తమ ప్రమాణ పత్రాలను అందించారు. ఆటోనగర్ సమస్యల పరిష్కారం కోసం చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు మహమ్మద్ సులేమాన్, సయ్యద్ చోటే,షేక్ జుల్ఫీ, బోడా రాజు, సిగిరెడ్డి సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.