
అనకాపల్లి, నవంబర్ 21: అనకాపల్లి జిల్లాలో నేటి నుండి మూడవ విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయి, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని 8 మండలాలతో పాటు అనకాపల్లి మండలంలోని పాపయ్య పాలెం, పి.ఎస్.పాలెం గ్రామ పంచాయతీలలో కూడా మూడవ విడత నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.
మూడో విడత భద్రతా ఏర్పాట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
మొత్తం మండలాలు - 8, గ్రామ పంచాయతీలు - 214, వార్డు మెంబర్లు - 2,046, పోలింగ్ లొకేషన్లు - 393, పోలింగ్ స్టేషన్లు - 2,046 ఉన్నాయని తెలిపారు. వీటిలో అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 96, సమస్యాత్మక కేంద్రాలు 82 గా గుర్తించామని పేర్కొన్నారు.
నామినేషన్లు జరుగుతున్న అన్ని కేంద్రాల వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎస్పీ ఆదేశించారు.
నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని, అనుమతి లేని వ్యక్తులను ఆ పరిధిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని స్పష్టం చేశారు.
నామినేషన్ కేంద్రాల సమీపంలో గుంపులుగా గుమికూడటం, ఊరేగింపులు నిర్వహించడంపై పూర్తి నిషేధం ఉందని, ట్రాఫిక్ కు, సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటిస్తూ ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ తుహిన్ సిన్హా విజ్ఞప్తి చేశారు.