అనకాపల్లిలో పోలీసుల ప్రత్యేక వాహన తనిఖీలు..

అనకాపల్లిలో పోలీసుల ప్రత్యేక వాహన తనిఖీలు..

21/November/2026 21:11    Share:   

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు!

అనకాపల్లి:

నేరాలకు పాల్పడి పోలీసుల కళ్లుగప్పేందుకు తప్పుడు నంబర్ ప్లేట్లు ఉపయోగిస్తున్న వాహనదారులకు ఇకపై ఇబ్బందులు తప్పవు. చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, రహదారి ప్రమాదాల్లో నిందిత వాహనాలను సులభంగా గుర్తించేందుకు అనకాపల్లి పోలీసులు ప్రత్యేక తనిఖీలకు శ్రీకారం చుట్టారు.

అనకాపల్లి డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తప్పుడు నంబర్ ప్లేట్లు, విరిగిపోయిన నంబర్ ప్లేట్లు, స్పష్టంగా కనిపించని ప్లేట్లు, మోటార్ వాహన చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన నంబర్ ప్లేట్లను గుర్తించి చర్యలు చేపట్టారు.

నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న వాహనదారులకు జరిమానాలు విధించడంతో పాటు, వెంటనే సరైన నంబర్ ప్లేట్లను అమర్చించారు.

వాహనాల గుర్తింపునకు నంబర్ ప్లేట్లు అత్యంత కీలకమని, ముఖ్యంగా చైన్ స్నాచింగ్, హిట్ అండ్ రన్ వంటి కేసుల్లో నిందితులను గుర్తించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని పోలీసులు వివరించారు.

వాహనదారులకు రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు స్పష్టంగా కనిపించే విధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు.

ఈ తనిఖీల్లో అనకాపల్లి టౌన్ సీఐ జి. ప్రేమ్ కుమార్, ట్రాఫిక్ సీఐ నాగేశ్వరరావు, టౌన్ ఎస్ఐ షేక్ జిలాని, ట్రాఫిక్ ఎస్ఐ అర్జున్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter