రబీ సాగులో అధిక దిగుబడులకు యాజమాన్య పద్ధతులు కీలకం
19/November/2026 07:43
Share:
- తక్కువ పెట్టుబడితో లాభాల కోసం నూనెగింజలు, రాగుల సాగు మేలు - రామారాయుడుపాలెంలో రైతులకు అవగాహన సదస్సు
యలమంచిలి : అర్నాబ్ తుఫాను అనంతరం ప్రస్తుత పంటల స్థితిగతుల పరిశీలన, రబీ కార్యాచరణ ప్రణాళికపై యలమంచిలి మండలం రామారాయుడుపాలెం గ్రామంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వనరుల కేంద్రం సహాయ సంచాలకులు శ్రీధర్ మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు, మెరుగైన లాభాలు పొందాలంటే రైతులు నూనెగింజలు, జనుము, రాగుల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. కొక్కిరాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో వైఎల్ఎం-146 రకం నూనెగింజల విత్తనాలు కిలో రూ. 350 చొప్పున అందుబాటులో ఉన్నాయని, అలాగే వ్యవసాయ శాఖ వద్ద జనుము విత్తనాలు ఉన్నాయని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీసీటీ సీనియర్ శాస్త్రవేత్త శ్రీహరి మాట్లాడుతూ.. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నువ్వు పంటలో ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చని వివరించారు. మండల వ్యవసాయ అధికారి మోహన్రావు మాట్లాడుతూ.. మండలంలో ఎరువుల కొరత ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్లో రైతులు స్వయంగా నమోదు చేసుకుని, తమకు సమీపంలోని డీలర్ల వద్ద ఎరువులను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి విజేత, కొక్కిరాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రతినిధి చాందిని, కౌన్సిలర్ బెజవాడ మణి, మార్కెటింగ్ కమిటీ వైస్ ఛైర్మన్ గొర్ల బాబూరావు, స్థానిక నాయకులు, అభ్యుదయ రైతులు తోట గణేష్, గిరి, రమేష్, వెంకటరమణ, గొర్లె మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.